ఢిల్లీలో భారీ నిర్బంధాలు.. 7 వేల మందికి పైగా ఆందోళనకారులు అదుపులోకి!
x

ఢిల్లీలో భారీ నిర్బంధాలు.. 7 వేల మందికి పైగా ఆందోళనకారులు అదుపులోకి!

ప్రజా మద్దతు లేక వెలవెల పోయిన సీజేపీ నిరసన


Click the Play button to hear this message in audio format

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని రాజకీయ పిలుపునిచ్చిన సీజేపీ ఆందోళన విఫలమైంది. దాని మద్దతుదారులు, రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ ఢిల్లీలో అడుగుపెట్టకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఘటనలో దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడి అయింది. సీజేపీ నేతలతో పాటు నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధానిలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపించాయని విపక్షాలు ఆరోపించాయి. బీజేపీ మాత్రం ఇదో ‘‘ఫ్లాప్’’ షో అంటూ ఎద్దేవా చేసింది.

ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని, కొత్త ఓటర్ల నమోదులోనూ అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను సీజేపీ కానీ, ఇతర ప్రతిపక్ష నాయకులు గాను ఇవ్వకపోవడం గమనార్హం. నిబంధనలు ఉల్లంఘించి కేవలం మూడు రోజుల ముందు మాత్రం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సీజేపీ అనుమతి కోరింది. వాస్తవానికి పదిరోజుల ముందుగానే పోలీసులకు సంబంధిత అంశంపై నిరసన తెలియజేయడానికి అనుమతి కోరాలి. కానీ అవేవి సీజేపీ పాటించకపోవడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు.

భారీ భద్రత..

అక్టోబర్ 10న నిరసన ప్రారంభం కాకముందే ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరవ్యాప్తంగా 30 వేల మందికి పైగా పోలీసు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. మెట్రో స్టేషన్ల మూసివేత, బారికేడ్లు, వాహనాల తనిఖీలతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లోని తన నివాసం నుంచి యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా నిర్బంధించారు.
మరోవైపు, నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, మాణిక్ సర్కార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రెజిమ్ ఛేంజ్ ఎక్స్ పర్ట్ యోగేంద్ర యాదవ్‌తో పాటు పలువురిని కూడా నిర్బంధించారు.
నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో కొన్ని చోట్ల రాళ్లదాడులు జరిగాయని, ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నిర్బంధంలోకి తీసుకున్నట్లు పలువురు జర్నలిస్టులు కూడా ఆరోపించారు.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువత తమ నిరసనలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరోవైపు, బీజేపీ నేతలు మాత్రం నిరసన పేరుతో ఢిల్లీని స్తంభింపజేయాలన్న ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, నిర్బంధితులను 24 గంటల్లో విడుదల చేయకపోతే శాంతియుత నిరసన లేదా నిరాహార దీక్ష చేపట్టే అంశాన్ని పరిశీలిస్తానని కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ప్రకటించారు. నిర్బంధాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషన్ కూడా దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఢిల్లీలో భద్రతా చర్యలు, నిరసనకారుల నిర్బంధాలు, వాటిపై రాజకీయ పార్టీల స్పందనలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలు, నిరసనలకు అనుమతులు, పౌరుల రాకపోకలపై ఆంక్షలకు సంబంధించిన అంశాలు తదుపరి పరిణామాల్లో కీలకంగా మారనున్నాయి.

ప్రజా మద్దతు కరువు...

‘సర్’ లో అక్రమాలు జరిగాయంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి కొన్ని స్వచ్చంద సంస్థలు, కొంతమంది హక్కుల కార్యకర్తలు కూడా జత కలిశారు. అయితే వీరి ఆందోళనకు ఎక్కడా ప్రజా మద్దతు లభించడం లేదు. సామాన్యులు ఎవరూ కూడా వీరి వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గత ఉద్యమంలో కనిపించిన జెన్ జీ జాడ కూడా ఇక్కడ కనిపించలేదు.

మేధావుల ఆగ్రహం..

రాజ్యాంగ వ్యవస్థపై అపనమ్మకం కలిగించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వీటికి స్వచ్ఛంద సంస్థలు, హక్కుల నినాదాల ముసుగులు తగిలించాయని కొంతమంది మేధావులు ఆరోపించారు. ఇంతకుముందే వీటిపై మాజీ న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేయగా, తాజాగా 120 మందికి పైగా బ్యూరోక్రాట్లు కూడా ఓ లేఖను విడుదల చేశారు.
దేశంలో విపక్ష పార్టీలు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రచారం చేస్తున్నారని, ఓడినప్పుడు మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అంటూ రోడ్డెక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ద్వారా జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విపక్షాలు ఎలా గెలిచాయని ప్రశ్నలు గుప్పించారు.
బీహార్ లో జరిగిన ఉప ఎన్నికలో కూడా జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలిచారని, అక్కడ బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ విపక్షాలు మాత్రం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.


Read More
Next Story