
హైదరాబాద్ నగరంలో స్లీపర్ బస్సులో అగ్నిప్రమాదం
కూకట్‌పల్లిలో అర్ధరాత్రి అగ్నికీలలు: స్లీపర్ బస్సు దగ్ధం
వరుసగా స్లీపర్ బస్సుల అగ్నిప్రమాదాలు… భద్రతపై మళ్లీ ప్రశ్నలు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగర ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మరో స్లీపర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన భద్రతపై తీవ్ర సందేహాలను తెరపైకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళుతుండగా మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్లాల్సిన ఎన్ ఎల్ 02B9955 నంబరు బస్సులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన బస్సు సిబ్బంది ప్రయాణికులను దింపేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
మరో స్లీపర్ బస్సులో అగ్నిప్రమాదం
ఇటీవల వరుసగా స్లీపరు బస్సులు అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి.శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు మియాపూర్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు వెళ్లే మార్గంలో ఎస్ఆర్ నగర్ వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.దీంతో స్లీపర్ బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. శుక్రవారం రాత్రి ఈ బస్సు కేపీహెచ్‌బీలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ సమీపానికి చేరుకున్నప్పుడు డ్రైవర్ క్యాబిన్‌లో మొదట మంటలు కనిపించాయి.బస్సు సిబ్బంది వెంటనే స్పందించి ప్రయాణీకులందరినీ సామానుతో సహా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.నిమిషాల వ్యవధిలోనే మంటలు వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి.
మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే కూకట్‌పల్లి ట్రాఫిక్ సీఐ జానయ్య,అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే బస్సులో మంటలను అదుపులోకి తెచ్చారు.ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని ట్రాఫిక్ సీఐ జానయ్య చెప్పారు. ఈ సంఘటన కారణంగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
బస్సు దగ్ధం ఘటనలో ప్రాణనష్టం తప్పినప్పటికీ, వరుసగా జరుగుతున్న ఇలాంటి అగ్నిప్రమాదాలు ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రమాదాల అసలు కారణాలను వెలికితీసి, కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశముందనే ఆందోళన బస్సు ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది.
Next Story

