
హైదరాబాద్‌కు లక్ష ఇందిరమ్మ ఇళ్లు! ఇందిరమ్మ ఇళ్ల జాతర!
బందర్ పోర్టుకు డైరెక్ట్ కనెక్టివిటీ..! | మిల్చి మిల్క్‌పై రాజకీయ దుమారం!
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) ఇందిరమ్మ ఇళ్ల జాతర! హైదరాబాద్‌కు లక్ష ఇందిరమ్మ ఇళ్లు!
2) బందర్ పోర్టుకు డైరెక్ట్ కనెక్టివిటీ..!
3) మిల్చి మిల్క్‌పై రాజకీయ దుమారం!
1) ఇందిరమ్మ ఇళ్ల జాతర! హైదరాబాద్‌కు లక్ష ఇందిరమ్మ ఇళ్లు!
హైదరాబాద్‌లో సొంత ఇల్లు కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామాల్లో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు నగర పేదలకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో దశలవారీగా లక్ష ఎల్‌ఐజీ (LIG) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 20న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే రోజు దరఖాస్తుల ప్రక్రియ, అర్హతలు, ఎంపిక విధానం, టెండర్లు, నిర్మాణ నమూనా వంటి పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులతో కలిసి ఈ వివరాలను వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు.
తొలి దశలో ఎలా అమలు?2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లను నిర్మించనున్నారు. అవసరాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్యను 1,000 వరకు పెంచే అవకాశం కూడా ఉంది.
ఈసారి గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా...గత ప్రభుత్వ హయాంలో నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడంతో చాలా మంది లబ్ధిదారులు అక్కడ నివసించలేకపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల చదువు, ఆస్పత్రులు, రవాణా వంటి అవసరాలు దూరమవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొంది.
అందుకే ఈసారి ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూములపైనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి కోల్పోకుండా శాశ్వత నివాసంతో పాటు ఆస్తిపై యాజమాన్య హక్కు కూడా లభించేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
స్థలాల గుర్తింపు పూర్తయిందిహైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ భూములను ఇప్పటికే గుర్తించి హౌసింగ్ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. ఏ ప్రాంతంలో ఎన్ని ఇళ్లు నిర్మించాలి? ఎన్ని అంతస్తులు ఉండాలి? ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం ఎంత? భవనాల డిజైన్ ఎలా ఉండాలి? వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
దరఖాస్తుల కోసం భారీ స్పందన
ఈ పథకం ప్రకటించిన తర్వాతే ప్రజల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. ప్రజావాణిలో ప్రతి సోమవారం సగటున వెయ్యి నుంచి 1,500 వరకు దరఖాస్తులు వస్తుండగా, వాటిలో దాదాపు 90 శాతం ఇందిరమ్మ ఇళ్లకే సంబంధించినవని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఒకే రోజు వచ్చిన 1,061 దరఖాస్తుల్లో 908 హౌసింగ్ శాఖకే సంబంధించినవిగా నమోదు అయ్యాయి. దరఖాస్తుదారులకు సహాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు.
CURE అంటే ఏమిటి?
CURE అంటే Hyderabad Core Urban Region. హైదరాబాద్ నగర అభివృద్ధి, మౌలిక వసతులు, ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్, మున్సిపల్ సేవలు, విపత్తుల నిర్వహణ వంటి అంశాలను ఒకే వేదికపై సమన్వయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పాలనా వ్యవస్థ. ఈ ప్రాంత పరిధిలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టనుంది.
మొత్తంగా చూస్తే... గ్రామీణ ప్రాంతాల తర్వాత ఇప్పుడు నగర పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 20న పూర్తి మార్గదర్శకాలు విడుదల కానుండగా.. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియపై అప్పుడే స్పష్టత రానుంది. హైదరాబాద్‌లో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వేలాది కుటుంబాలకు ఇది కీలక పరిణామంగా మారింది.
2) బందర్ పోర్టుకు డైరెక్ట్ కనెక్టివిటీ..!
తెలంగాణ రవాణా రంగంలో గేమ్ ఛేంజర్‌గా నిలవనున్న రెండు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకటి హైదరాబాద్-అమరావతి 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే.. మరొకటి తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ (RRR). ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. పరిశ్రమలు, లాజిస్టిక్స్, పెట్టుబడులకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఎప్పుడు ఆమోదం తెలుపుతుంది? హైదరాబాద్ నుంచి అమరావతి కేవలం మరింత తక్కువ సమయంలో చేరుకునే అవకాశం!
ప్రాజెక్ట్-1
హైదరాబాద్–అమరావతి 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపూర్తిగా కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే12 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారి భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు (మచిలీపట్నం) పోర్టు వరకు ప్రతిపాదన ఏపీ పునర్విభజన చట్టం స్పూర్తిలో ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
ప్రధాన ప్రయోజనాలు
1. దూరం తగ్గుతుందిః హైదరాబాద్-విజయవాడ మధ్య దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
2. ప్రయాణ సమయం తగ్గుతుంది: ప్రస్తుతం ట్రాఫిక్‌తో కలిసి 5.5 నుంచి 7 గంటలు. భవిష్యత్తులో 4 నుంచి 5 గంటల్లోపు ప్రయాణించే అవకాశం. ముఖ్యంగా సరుకు రవాణాకు భారీ లాభం.
3. పోర్ట్ కనెక్టివిటీః హైదరాబాద్ పరిశ్రమలు, ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ నేరుగా మచిలీపట్నం పోర్టుకు వేగంగా చేరే అవకాశం. దీంతో ఎగుమతుల ఖర్చు తగ్గుతుంది. లాజిస్టిక్స్ వేగం పెరుగుతుంది.
4. పరిశ్రమలకు లాభంః హైవే వెంబడి ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ హబ్‌లు, వేర్‌హౌస్‌లు, ట్రక్ టెర్మినల్స్, కొత్త టౌన్‌షిప్‌లు ఏర్పడే అవకాశముంది.
5. రియల్ ఎస్టేట్ః హైవే వెంట భూముల విలువ పెరిగే అవకాశం. కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం.
ప్రాజెక్ట్-2
తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ (RRR)ః హైదరాబాద్ ORRకు బయట మరో భారీ రింగ్ రోడ్. పొడవు సుమారు 340 కిలోమీటర్లు. 6 లేన్ల రహదారిగా ప్రణాళిక. ఇది ఎందుకు అవసరం? ప్రస్తుతం అన్ని వాహనాలు హైదరాబాద్ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. RRR వస్తే నగరంలోకి రావాల్సిన అవసరం ఉండదు. బయటగానే రాష్ట్రం చుట్టూ ప్రయాణించవచ్చు.
ఏ జాతీయ రహదారులను కలుపుతుంది? NH-44, NH-65, NH-163, NH-765, వంటి ప్రధాన హైవేలను అనుసంధానం చేస్తుంది.
RRR వల్ల కలిగే ప్రయోజనాలుః ట్రాఫిక్ తగ్గుతుంది. భారీ ట్రక్కులు. లాంగ్ డిస్టెన్స్ వాహనాలు. హైదరాబాద్ నగరంలోకి రావాల్సిన అవసరం తగ్గుతుంది.
పరిశ్రమలకు బూస్ట్ః RRR వెంట కొత్త పరిశ్రమలు. లాజిస్టిక్ పార్కులు, డ్రై పోర్టులు, గిడ్డంగులు అభివృద్ధి చెందే అవకాశం.
జిల్లాలకు లాభంః హైదరాబాద్ చుట్టూ ఉన్న సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, భువనగిరి, నల్గొండ, ఇతర పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం కావచ్చని అంచనా.
భూముల విలువ RRR చుట్టుపక్కల రియల్ ఎస్టేట్, పారిశ్రామిక భూములు డిమాండ్ పెరిగే అవకాశం. రెండు ప్రాజెక్టులు కలిసి వస్తే... తెలంగాణకు కలిగే మార్పు Road Network, ORR, RRR, Greenfield Highway మూడు కలిసి భారీ రోడ్ నెట్‌వర్క్‌గా మారతాయి.
Freight Corridorహైదరాబాద్
↓
Future సిటీ
↓
అమరావతి
↓
బందరు పోర్టు
ఒక వేగవంతమైన సరుకు రవాణా కారిడార్‌గా అభివృద్ధి చెందే అవకాశం.
పెట్టుబడులు, దేశీయ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు తయారీ రంగం ఎగుమతుల ఆధారిత పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాలు, నిర్మాణ దశలో హైవే సేవలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, పరిశ్రమలు, వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం.ప్రస్తుతం ఎక్కడ ఆగి ఉన్నాయి?
RRR = ఉత్తర భాగంలో భూసేకరణ దాదాపు 95% పూర్తయింది.
కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.
దక్షిణ భాగానికి కూడా ఒకేసారి అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
గ్రీన్‌ఫీల్డ్ హైవేకేంద్రం నుంచి తుది ఆమోదం, తదుపరి సాంకేతిక/పరిపాలనా ప్రక్రియలు అవసరం.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఎదురయ్యే సవాళ్లుః కేంద్ర ప్రభుత్వ తుది అనుమతులు, పూర్తి స్థాయి DPR, ఫైనల్ అలైన్‌మెంట్, మిగిలిన భూసేకరణ, పర్యావరణ అనుమతులు (అవసరమైన చోట), భారీ నిధుల సమీకరణ, నిర్మాణ కాలపట్టికహైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్‌గా మార్చే సామర్థ్యం ఉన్న రెండు ప్రాజెక్టులు ఇవి.
ఒకటి నగరానికి బయట ట్రాఫిక్‌ను మళ్లించే RRR...
మరొకటి తెలంగాణను నేరుగా అమరావతి, బందరు పోర్టుతో కలిపే 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే... కేంద్రం ఎప్పుడు తుది గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? ఆ తర్వాత ఈ మెగా ప్రాజెక్టులు ఎంత వేగంగా పట్టాలెక్కుతాయన్నదే అసలు ప్రశ్న.
3) మిల్చి మిల్క్‌పై రాజకీయ దుమారం!
తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో ఎప్పుడూ దూకుడుగా కనిపించే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇప్పుడు తానే ఓ రాజకీయ వివాదం మధ్యలో నిలిచారు. ఆయన కుటుంబానికి చెందిన "మిల్చి మిల్క్" డెయిరీ వ్యాపారం చుట్టూ మొదలైన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు శ్రీకారం చుడుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి.
"మిల్చి మిల్క్" తెలంగాణలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించే ప్రైవేట్ బ్రాండ్. 2020 ఆగస్టులో కరోనా సమయంలో ప్రజలకు నాణ్యమైన, రోగనిరోధక శక్తిని పెంచే పాల ఉత్పత్తులను అందిస్తామనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. హరీష్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే పాలు సరఫరా చేస్తామని ప్రకటిస్తూ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది.
మిల్చి మిల్క్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత. హరీష్ రావుకు చెందిన దాదాపు 400 ఎకరాల ఫామ్‌హౌస్‌లో డెయిరీ వ్యాపారం జరుగుతోందని, ఈ వ్యాపారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపార వర్గాలతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు.
అంతేకాదు.. రాజకీయ అండదండలతోనే మిల్చి మిల్క్ చాలా తక్కువ సమయంలో మార్కెట్లో బలమైన బ్రాండ్‌గా ఎదిగిందని కూడా ఆమె విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా మిల్చి మిల్క్ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిల్చి మిల్క్ డెయిరీ ఫామ్‌కు ప్రభుత్వ పరంగా ఏవైనా ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారా? ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్లు, ఇతర లబ్ధులు ఏమైనా అందాయా? అనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ముఖ్యంగా విజయా డెయిరీకి నష్టం జరిగిందా? ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పాల సరఫరాలో ప్రైవేట్ డెయిరీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారా? అనే అంశాలపై కూడా ప్రభుత్వం నివేదిక కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఈ వివాదంలో ప్రధాన ఆరోపణ ప్రభుత్వ సరఫరాలపైనే కేంద్రీకృతమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు, పాల ఉత్పత్తుల సరఫరాలో ప్రభుత్వ రంగ సంస్థ విజయా డెయిరీని పక్కనబెట్టి, మిల్చి మిల్క్‌కు చెందిన సంస్థలకు అవకాశాలు కల్పించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కొన్ని చోట్ల టెండర్ల ప్రక్రియను పూర్తిగా పాటించలేదని, దీనివల్ల విజయా డెయిరీ కోట్ల రూపాయల మేర నష్టపోయిందని కూడా కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ ఆరోపణలపైనే ప్రభుత్వం ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఈ వివాదంలో మరో ప్రధాన అంశం మార్కెట్ నెట్‌వర్క్.
సాధారణంగా కొత్త డెయిరీ బ్రాండ్‌లు మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే రిటైల్ మార్కెట్, కిరాణా దుకాణాలు, సాధారణ వినియోగదారులపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే మిల్చి మిల్క్‌కు బహిరంగ మార్కెట్‌లో పెద్దగా వాటా లేకపోయినా.. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు భారీ స్థాయిలో పాలు, పాల ఉత్పత్తులు సరఫరా అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ బల్క్ ఆర్డర్లు ఎలా వచ్చాయి? రాజకీయ ప్రభావం పనిచేసిందా? లేక నాణ్యత ఆధారంగానే ఈ ఒప్పందాలు జరిగాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సంస్థలో అపోలో గ్రూప్‌కు చెందిన వ్యక్తులు, చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అలాగే కాంగ్రెస్, బీజేపీకి చెందిన మరికొందరు ప్రముఖుల కుటుంబాల పెట్టుబడులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది రోజులకే మిల్చి మిల్క్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పనిచేయకుండా పోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో సంస్థలోని పెట్టుబడిదారుల వివరాలను దాచేందుకే వెబ్‌సైట్ నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కొందరు నెటిజన్లు పాత స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతల మధ్య వ్యాపార సంబంధాలపై చర్చ మొదలుపెట్టారు.
ఈ వివాదంలో కాంగ్రెస్ మరో రాజకీయ అంశాన్ని కూడా ముందుకు తెచ్చింది.తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు విడుదల చేయాలని హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని గుర్తు చేస్తూ... అదే సమయంలో ఆయన కుటుంబానికి చెందిన మిల్చి మిల్క్ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్‌లోని చైతన్య, నారాయణ విద్యాసంస్థలు సహా పలు పెద్ద సంస్థలకు ఎలా సరఫరా అవుతున్నాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. నీటి విషయంలో ఒక వైఖరి... వ్యాపారంలో మరో వైఖరా? అంటూ కాంగ్రెస్ రాజకీయంగా నిలదీస్తోంది. దీంతో ఈ అంశం కూడా హరీష్ రావుపై రాజకీయ ఒత్తిడిని పెంచింది.మిల్చి మిల్క్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక ప్రైవేట్ డెయిరీ కంపెనీ వివాదం మాత్రమే కాదు. ప్రభుత్వ ప్రయోజనాలు, టెండర్లు, రాజకీయ సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలు, ప్రభుత్వ సంస్థలకు జరిగినట్లు చెబుతున్న నష్టం... ఇలా అనేక కోణాల్లో చర్చ సాగుతోంది.ఒకప్పుడు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన హరీష్ రావు.. ఇప్పుడు తన కుటుంబ వ్యాపారంపై వచ్చిన ఆరోపణలతో రాజకీయంగా డిఫెన్స్‌లో పడ్డారు. ఈ ఆరోపణలు నిజమా? లేక రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయా?

