
ఆర్టీసీలో కీలక మార్పులు అవసరం: పొన్నం ప్రభాకర్
జూమ్ సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. సిబ్బంది సమస్యలు, డిపో పరిస్థితులు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని తెలిపారు.
ఆర్టీసీ పనితీరుపై కీలక మార్పులు అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాజాగా ఉన్నతాధికారులతో జరిగిన జూమ్ సమావేశంలో ఆయన ఇచ్చిన సూచనలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఆర్‌ఎంలు, హెచ్‌ఓడీలు, డీఎంలు పాల్గొన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాల నేతలతో చేసిన చర్చలో వచ్చిన అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా, అధికారులు కింది స్థాయి సిబ్బందితో సానుకూలంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందితో కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా పని చేయించుకోవాలని చెప్పారు. వేధింపులు లేకుండా పని జరిగేలా చూడాలని అన్నారు. ప్రయాణికులతో కూడా మంచి సంబంధాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. డిపో మేనేజర్లు, సిబ్బంది అందరూ ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు.
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. మే 17 లోపు డిపోలు, బస్ స్టేషన్లలో టాయిలెట్స్, తాగునీరు, పరిశుభ్రత, ప్లాంటేషన్ వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై కూడా మంత్రి చర్చించారు. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు డిపోలు నష్టాల్లో ఎందుకు ఉన్నాయో సమీక్షించాలని ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లను కోరారు. టిక్కెట్ సమస్యలు, సిబ్బంది మధ్య గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
సంస్థలో అంతర్గత విభేదాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి రెండో మంగళవారం సిబ్బంది సమస్యలు వినేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. డిపో మేనేజర్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు. సమస్యలు స్థానిక స్థాయిలో పరిష్కారం కాకపోతే ఎండీ స్థాయిలో తీసుకువెళ్లాలని సూచించారు. పెండింగ్ పనులను జూన్ లోపు పూర్తి చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆదేశించారు.

