ప్రజలకు మంత్రి సీతక్క వార్నింగ్..
x

ప్రజలకు మంత్రి సీతక్క వార్నింగ్..

వేసవి ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరాయి. ప్రజలు, కార్మికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు ఇచ్చారు.


తెలంగాణ ప్రజలకు మంత్రి సీతక్క కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయని, కాబట్టి వీలైనంత వరకూ ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే నెత్తికి తలపాగా పెట్టుకోవాలని, అదే విధంగా మంచినీళ్ల బాటిల్‌ను కూడా తమతో ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని మెచ్చరించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. ఏవైనా పనులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు పూర్తి చేసుకోవాలని, 11 గంటల నుంచి నీడపట్టున ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత మండనున్నాయని, పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో కనిపించే ఈ స్థాయి వేడి, ఈసారి రెండో వారంలోనే మొదలైంది.

గత వారం రోజులుగా భానుడు మండిపోతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్న సమయంలో హైదరాబాద్ రోడ్లపై రాకపోకలు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తలకు టోపీ లేదా తలపాగా ధరించాలని, శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ ముప్పు ఉంటుందని హెచ్చరించారు.

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వీటిని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. వేసవిలో పనులు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపారు. తలకు తలపాగా ధరించడం, తాగునీరు దగ్గర ఉంచుకోవడం, శరీరాన్ని రక్షించుకోవడం అవసరమని చెప్పారు. పనిస్థలాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని సూచించారు. కార్మికుల ఆరోగ్యం కూడా ముఖ్యమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పనులను తగ్గించాలని సూచించినట్లు తెలిపారు. వాతావరణ శాఖ కూడా ప్రజలకు జాగ్రత్తలు సూచించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపింది. బయటకు వెళ్లే వారు గొడుగు, నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలని సూచించింది. శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు, కొబ్బరి నీరు తీసుకోవాలని పేర్కొంది.

పిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నాలుగు రోజులు వేడి గాలులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొత్తంగా, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు కొనసాగుతున్నాయి.

Read More
Next Story