
ఆవేశంతో పరిష్కారాలు రావు.. డ్రైవర్ ఘటనపై కేబినెట్
కార్మికులు ఆవేశపూరిత నిర్ణయాలు వద్దని సూచనలు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు సిద్ధమని హామీ.
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాగా గురువారం పలు చోట్లు కార్మికులు క్షణికావేశానికి లోనై ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో శంకర్ అనే వ్యక్తి నిప్పంటిచుకోగా.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇదే తరహా ఘటనలో మరో రెండు మూడు చోట్ల కూడా జరగడంతో వీటిపై తెలంగాణ మంత్రివర్గం వెంటనే స్పందించింది. ఎవరు క్షణికావేశానికి లోనై.. ప్రాణాలను పోగొట్టుకోవద్దని మంత్రివర్గం కోరింది. వారికి అనుకూలంగానే తమ ప్రభుత్వం స్పందిస్తుందని హామీ ఇచ్చారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రేపు చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కార్మికులు ఆవేశానికి లోనవకుండా, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. ప్రాణాలు తీసుకునే చర్యలు కుటుంబాలకు నష్టం చేస్తాయని చెప్పారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని వివరించారు.
ప్రాణాలో తీసుకోవడం పరిష్కారం కాదు: రేవంత్ రెడ్డి
కేబినెట్‌లో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సీఎం తెలిపారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రేపు చర్చలు జరపాలని ఆదేశించారు.
మీ సమస్యలు మేం పరిష్కరిస్తాం: పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. కేబినెట్ స్థాయిలో చర్చ ఆలస్యమైనా, మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. రేపు జేఏసీ నేతలతో చర్చలు ఉంటాయని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉద్యోగాలు పోతాయన్న ప్రచారం సరైంది కాదని చెప్పారు.
కుటుంబాలను గుర్తు చేసుకోండి: శ్రీధర్ బాబు
కేబినెట్‌లో ఆర్టీసీ అంశంపై చర్చ జరిగినట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కార్మికులు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం బాధాకరమని, కుటుంబాలను గుర్తు పెట్టుకోవాలని అన్నారు. రేపు డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చర్చలు జరుగుతాయని తెలిపారు.
ఆవేశంతో వద్దు చర్చలకు రండి: దామోదర రాజనరసింహ
ప్రభుత్వానికి సమస్యల పరిష్కారంపై నిజమైన ఉద్దేశం ఉందని మంత్రి తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు ఆవేశపడకుండా చర్చలకు రావాలని కోరారు. భావోద్వేగాలతో సమస్యలు పరిష్కారం కావని సూచించారు.
ప్రజా పాలనలో ప్రాణ త్యాగాలొద్దు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కార్మికులు ప్రాణత్యాగాలు చేయకూడదని మంత్రి పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసిన విషయాన్ని వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. గాయపడిన శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
జేఏసీ తదుపరి కార్యాచరణ
మరోవైపు ఆర్టీసీ జేఏసీ తమ తదుపరి కార్యక్రమాలను ప్రకటించింది. ఈ నెల 24న మౌన ప్రదర్శనలు, 25న వంటవార్పు, 26న కార్మిక కవాతు నిర్వహించనున్నారు. 27న ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మలతో నిరసన చేపడతారు. 29న అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

