
కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఫొటో : దక్షిణమధ్య రైల్వే సౌజన్యంతో)
కాజీపేట నుంచి దూసుకెళ్లనున్న ఆధునిక ఇంటర్‌సిటీ రైళ్లు
రూ.521 కోట్లతో సిద్ధమైన కాజీపేట రైల్ యూనిట్.. త్వరలో కోచ్‌ల తయారీ ప్రారంభం
తెలంగాణలోని కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలో ఇంటర్‌సిటీ రైలు బోగీల తయారీని ప్రారంభించనుంది. రూ.521 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు 95 శాతం పూర్తికాగా, ఆటోమేటిక్ డోర్లు, రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను ఇక్కడ తయారు చేయనున్నారు. ఇది తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం ఇవ్వనుంది.
త్వరలో ఇంటర్ సిటీ రైళ్ల ఉత్పత్తి ప్రారంభం
కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంటర్ సిటీ రైళ్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టనుంది. 300 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగించే ఇంటర్ సిటీ రైలు బోగీలను కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో తయారు చేయనున్నారు. పట్టణాలు, నగరాల మధ్య రాకపోకలు సాగించే ఇంటర్ సిటీ రైళ్లను 20 కోచ్ లతో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీంతో కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఈ రైలు బోగీలను ఆటోమేటిక్ డోర్లు, రీజనరేటివ్ బ్రేకింగ్స్ తో తయారు చేయనున్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా తయారు చేయనున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ ప్రారంభం గురించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే అధికారులతో సమీక్షించారు.రూ.521.36 కోట్ల ప్రాజెక్టు 95 శాతం పూర్తి అయిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని, త్వరలో ఇంటర్ సిటీ రైలు బోగీల తయారీని ప్రారంభించనుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కాజీపేటలో తయారయ్యే రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిరని ఆయన తెలిపారు.
తెలంగాణలోని కాజీపేటలో ఉన్న రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్ భారతదేశ రైల్వే రోలింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి ఊతం ఇవ్వనుందని మంత్రి పేర్కొన్నారు..ఆర్‌ఎమ్‌యు భారతీయ రైల్వేల కోసం రోలింగ్ స్టాక్ ఉత్పత్తిని బలోపేతం చేయడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరుస్తుందన్నారు. ఈ యూనిట్ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, తెలంగాణ ,దాని పరిసర ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంపొందిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు.
తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి మైలురాయి
కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభంతో తెలంగాణ రైల్వే రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆధునిక సాంకేతికతతో తయారయ్యే ఇంటర్‌సిటీ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్టు కాజీపేటను జాతీయ స్థాయి రైల్వే తయారీ కేంద్రంగా నిలబెట్టడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, అనుబంధ పరిశ్రమలకు కొత్త దిశను చూపనుంది. తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో కాజీపేట యూనిట్ కీలక మైలురాయిగా నిలవనుంది.
Next Story

