
తెలంగాణలో ‘అబ్ కీ బార్ బీజేపీ సర్కార్’.. మోదీ ధీమా
పరేడ్ గ్రౌండ్స్ సభలో బీజేపీ విజయాలపై ప్రధాని మోదీ స్పందించారు. దేశవ్యాప్తంగా పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు.
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ విజయోత్సాహం కనిపిస్తోందని ఆయన అన్నారు. సభను తెలుగులో ప్రారంభించిన మోదీ.. పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు.
అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరిగిందని తెలిపారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ మళ్లీ గెలిచిందని, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి నమూనాపై విశ్వాసం చూపుతున్నారని మోదీ అన్నారు. అందుకే ప్రతి ఎన్నికలో పార్టీకి మద్దతు పెరుగుతోందని వివరించారు. పశ్చిమ బెంగాల్ విజయంతో దేశమంతా సంబరాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ప్రధాని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ చాలా కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని అన్నారు. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ రాజకీయాల భాగమైందని విమర్శించారు. తెలంగాణలో కూడా అబద్ధాలతో ప్రభుత్వం నడుస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాల కంటే ఎక్కువగా ఎడమ వైపు వెళ్లిందని అన్నారు. ముస్లిం లీగ్ కంటే కూడా ఎక్కువగా ఆ దిశగా మారిందని ఆరోపించారు.
మావోయిస్టుల అంశంపై కూడా మోదీ స్పందించారు. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులను రక్షించిందని అన్నారు. తెలంగాణ పోలీసులు కేంద్రంతో కలిసి ముందుగానే పనిచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని పేర్కొన్నారు. ఆలస్యమైనా మావోయిస్టులపై చర్యలు జరిగాయని చెప్పారు. తెలంగాణలో కొత్త విజన్‌తో, వికసిత్ తెలంగాణ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సభ ముగింపులో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

