
భారీ ప్రాజెక్టులతో తెలంగాణ మీద గురి పెట్టిన మోదీ...
తెలంగాణలో ఇండస్ట్రియల్ కారిడార్, టెక్స్‌టైల్ పార్క్, రైతులకు కొత్త అవకాశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తోందని, భవిష్యత్తులో కూడా చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. రానున్న కాలంలో తెలంగాణకు భారీ ప్రాజెక్ట్‌లు కేంద్రం నుంచి రానున్నాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తమ పార్టీ ఎటువంటి వివక్ష చూపదని, అన్ని రాష్ట్రాలను ఒకే రీతిలో చూస్తుందని అననారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇటీవల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 14 ఇండస్ట్రియల్ కారిడార్లలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు అవుతోందని వెల్లడించారు. జహీరాబాద్ ప్రాంతంలో వాహన తయారీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు ఆధునిక పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. దీంతో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
వరంగల్‌లో ఏర్పాటు అవుతున్న పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్‌ను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపు తీసుకువస్తుందని తెలిపారు. ముఖ్యంగా పత్తి రైతులకు దీని వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పత్తి ఉత్పత్తి, నాణ్యత పెంచేందుకు కేంద్రం కొత్త మిషన్‌కు ఆమోదం తెలిపిందని మోదీ వెల్లడించారు. వేల కోట్ల రూపాయలతో అమలు కానున్న ఈ పథకం ద్వారా లక్షలాది రైతులకు లాభం కలుగుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని కూడా ప్రధాని సూచించారు. సహజ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని కోరారు. డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపుసెట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వదేశీ వస్తువుల వినియోగంపై కూడా మోదీ దృష్టి పెట్టారు. రోజువారీ జీవితంలో భారత్‌లో తయారైన వస్తువులను ఉపయోగించాలని సూచించారు. చిన్న చిన్న మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లను ప్రజల సహకారంతోనే ఎదుర్కోగలమని ప్రధాని తన ప్రసంగంలో తెలిపారు.

