ఒక ఏడాది పాటు గోల్డ్ కొనవద్దు: ప్రజలకు మోదీ పిలుపు
x

ఒక ఏడాది పాటు గోల్డ్ కొనవద్దు: ప్రజలకు మోదీ పిలుపు

దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విదేశీ పర్యటనలు తగ్గించాలని, మెట్రో, ఈవీల వినియోగం పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


మధ్యతరగతి ప్రజలకు, కుటుంబాలకు ప్రదాని మోదీ గట్టి క్లాసే తీసుకున్నారు. ఖర్చులు చూసి చేసుకోవాలని సూచించారు. బంగారం కొనుగోళ్లపై కూడా మోదీ మాట్లాడారు. విపరీతంగా బంగారం కొనడానికి కొంత కాలం బ్రేకులు వేయాలని, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలంటే కొంతకాలం బంగారం కొనుగోళ్లను తగ్గించాలని కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

“నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా” అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల ప్రభావం అన్ని దేశాలపై పడుతోందన్నారు. ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా కేంద్రం జాగ్రత్త పడుతోందని చెప్పారు. అయితే దేశం నుంచి విదేశీ ద్రవ్యం బయటకు వెళ్లకుండా ప్రజలు కూడా సహకరించాలని ప్రధాని కోరారు. కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించారు.

విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని చెప్పారు. వంట నూనెల వినియోగాన్ని పరిమితం చేయాలని కూడా సూచించారు. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో రైళ్లను ఎక్కువగా ఉపయోగించాలని మోదీ పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని అన్నారు. దీంతో ఇంధన దిగుమతుల భారం తగ్గుతుందని వివరించారు. వ్యవసాయ రంగంపైనా ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు.

విదేశాల నుంచి దిగుమతి అయ్యే రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం జరుగుతోందని చెప్పారు. అలాగే దేశ సంపద కూడా విదేశాలకు వెళ్తోందన్నారు. అందుకే రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. డీజిల్ ఇంజన్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ప్రోత్సహిస్తున్నామని మోదీ తెలిపారు. వ్యవసాయంలో కొత్త మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. స్వదేశీ వస్తువుల వినియోగంపై కూడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేవలం పండుగల సమయంలో మట్టి దీపాలు కొనడం మాత్రమే స్వదేశీ కాదని అన్నారు. ప్రతి రోజూ వాడే వస్తువుల్లో కూడా భారత్‌లో తయారైన వాటినే ఉపయోగించాలని సూచించారు. అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

Read More
Next Story