
బంగారం కొనద్దనడం మోదీ చేతకాని తనమే: రేవంత్
విదేశాంగ విధానం, బీజేపీ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ ప్రజలకు చేసిన సూచనలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణాలు తగ్గించాలని చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం స్పందించారు. విదేశాంగ విధానంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రజలకు పిలుపులు ఇస్తోందని విమర్శించారు.
ప్రతిపక్షాల సూచనలు కూడా కేంద్రం తీసుకోవాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అనుభవలేమి, అహంకారం వల్ల దేశం సంక్షోభంలో పడుతోందని వ్యాఖ్యానించారు. యూరియా సరఫరా బాధ్యత కేంద్రానిదేనని, రాష్ట్రం పంపిణీ చేస్తుందని చెప్పారు. బీజేపీపై కూడా సీఎం విమర్శలు చేశారు. కేరళ, తమిళనాడులో పార్టీకి పరిమిత సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. ఎస్ఐఆర్‌ను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు.
జమిలి ఎన్నికలు 2029లో జరిగే అవకాశం ఉందని రేవంత్ అన్నారు. ప్రజాస్వామ్యంపై బీజేపీకి నమ్మకం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాజ్యాంగ ప్రక్రియను పాటిస్తే సరిపోతుందని చెప్పారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసుపై కూడా సీఎం స్పందించారు. డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. విచారణ ఇప్పటికే ప్రారంభమైందని, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశం కావడంతో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తుమ్మడి హట్టి అంశంపై ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు సీఎం వెల్లడించారు. దీనిపై స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి కూడా లేఖ పంపినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపైనా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్ ల్యాండ్స్, జాతీయ రహదారుల పనులు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆలస్యమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
మెట్రో, సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో తాను, ప్రధాని మోదీ అభివృద్ధి అంశాలపైనే మాట్లాడుకున్నామని, రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు.

