ఫేషియల్ రికగ్నిషన్‌తో నిరసనల పర్యవేక్షణ.. గోప్యతపై ఆందోళనలు
x

ఫేషియల్ రికగ్నిషన్‌తో నిరసనల పర్యవేక్షణ.. గోప్యతపై ఆందోళనలు

కాక్రోచ్ జనతా పార్టీ జంతర్‌మంతర్ వద్ద చేపడుతోన్న దీక్ష శిబిరానికి సమీపంలో పోలీసులు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వాహనాలను వాడడం వివాదానికి దారితీసింది.


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతోన్న విద్యార్థి నిరసనల సమయంలో పోలీసులు ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారనే విషయం కొత్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ వ్యవస్థపై గోప్యత, డేటా భద్రత, పర్యవేక్షణ పరిమితులపై ప్రశ్నలు తలెత్తాయి.

వైరల్ వీడియోతో చర్చ..

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో 360 డిగ్రీలు తిరగగల సీసీటీవీ కెమెరాలతో కూడిన నిఘా వాహనం కనిపించింది. ఆ వాహనంలోని స్క్రీన్‌పై కెమెరాల్లో నమోదైన వ్యక్తుల ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలు కనిపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ వ్యవస్థ ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానమైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఢిల్లీ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. ఆధార్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, నిరసన ప్రాంతంలో రెండు ప్రత్యేక నిఘా వాహనాలను మోహరించారు. ఒకటి సీసీటీవీ కెమెరాల ద్వారా లైవ్ దృశ్యాలను సేకరిస్తుంది. మరొకటి ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆ దృశ్యాలను విశ్లేషిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ పోలీసుల వద్ద ఉన్న నేర చరిత్ర గల వ్యక్తుల ఫోటో డేటాబేస్‌తో మాత్రమే పోల్చి చూస్తుందని తెలిపారు. నిరసనకారులందరినీ గుర్తించడం కోసం ఈ వ్యవస్థను ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు.

గోప్యతపై సందేహాలు..

అయితే వీడియోల్లో కనిపిస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ డేటాబేస్ నుంచి వస్తోందనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో పౌరహక్కుల సంఘాలు, గోప్యత పరిరక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విద్యార్థుల్లో భయం..

నిరసనల్లో పాల్గొంటున్న కొందరు విద్యార్థులు తమ ముఖాలను కెమెరాలు రికార్డు చేస్తున్నాయనే భయంతో ముఖాలను కప్పుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు, ఈ డేటా భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు చేసిన వీడియోలను ఎంతకాలం భద్రపరుస్తారనే విషయంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్ దర్యాప్తులకు అవసరమైతే వాటిని నిల్వ ఉంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

హైకోర్టులో విచారణ..

నిరసనకారులపై నిరంతర నిఘా రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఈ వ్యవస్థను శాంతిభద్రతల కోసమే ఉపయోగిస్తున్నామని, చట్టవిరుద్ధ నిఘా కోసం కాదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంపై గోప్యత, డేటా భద్రత, ప్రజల హక్కుల అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read More
Next Story