
తల్లి, ఇద్దరు పిల్లల అదృశ్యం
ఉదయం తన పిల్లలు శివరాంరెడ్డి, బృందనతో కలిసి బయటకు వెళ్ళిన మమత రాత్రయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు
ఈమద్య సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతిరెడ్డి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య ఘటనను జనాలు మరిచిపోకముందే అలాంటి అనుమానాలే మరో కుటుంబం విషయంలో పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే పటాన్ చెరు డివిజన్, మల్లన్న దేవస్ధానం సమీపంలోని ఎండీఆర్ హోమ్స్ లోని ఒక ఇంట్లో నివసిస్తున్న మమత తన ఇద్దరు పిల్లలతో మాయమైపోయింది. మంగళవారం ఉదయం తన పిల్లలు శివరాంరెడ్డి, బృందనతో కలిసి బయటకు వెళ్ళిన మమత రాత్రయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు. రాత్రంతా భార్య, పిల్లల కోసం బంధువులు, మిత్రుల ఇళ్ళల్లో వెతికిన భర్త నాగిరెడ్డి బుధవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు రాగానే పటాన్‌చెరు పోలీసులు స్పందించి వెతుకులాట మొదలుపెట్టారు. తల్లి, ఇద్దరు పిల్లల ఫొటోలను చుట్టుపక్కలున్న అన్నీ పోలీసుస్టేషన్లకు పంపించి వెదికిస్తున్నారు.
ఆమధ్య విజయశాంతిరెడ్డి అనే మహిళ కూడా తన ఇద్దరు పిల్లలతో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు కారణాలు తెలీక పోలీసులు దాదాపు మూడునెలలు నానా అవస్తలు పడ్డారు. చివరకు సరైన కారణం తెలీకపోవటంతో కేసును క్లోజ్ చేసేశారు. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో కుటంబంలోని కలహాలు బయటపడ్డాయి. విజయశాంతి భర్త సురేంద్ర తన భార్య తమ్ముడు, తల్లి మీదే ఫిర్యాదు చేశారు. దాంతో కొడుకు, తల్లి కూడా ఎదురు సురేంద్రమీద మరో ఫిర్యాదు చేశారు. క్లోజ్ చేసేసిన కేసును పోలీసులు మళ్ళీ ఓపెన్ చేసి దర్యాప్తుచేస్తున్నారు.
సరిగ్గా అలాంటి పద్దతిలోనే ఇపుడు మమత తన ఇద్దరి పిల్లలతో ఇంట్లోనుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి చేరకపోవటంతో భర్త, బంధువుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఏమైనా గొడవలుండి మమత ఇద్దరు పిల్లలతో ఇంట్లోనుండి బయటకు వెళ్ళిపోయిందా ? వెళ్ళి ఏమిచేసిందనే విషయం అర్ధంకాక పోలీసులు అవస్తలు పడుతున్నారు. చివరకు ఈ కేసు ఏ విధంగా ముగుస్తుందో చూడాలి.

