మూసీ ప్రాజెక్ట్.. రూ.1000 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన గ్రామాలు
x

మూసీ ప్రాజెక్ట్.. రూ.1000 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన గ్రామాలు

మూసీ నది కాలుష్యంతో బాధపడుతున్న గ్రామాలు పునరుద్ధరణకు షరతులు పెట్టి పలు కీలక డిమాండ్లు ప్రభుత్వానికి సమర్పించాయి.


మూసీ నది పునరుద్ధరణ విషయంలో నదీ పరివాహక గ్రామాలు తమ స్వరం వినిపించాయి. ప్రాజెక్ట్ విషయంలో పలు కండిషన్లు పెట్టాయి. అంతేకాకుండా తమకు రూ.1000 కోట్ల నష్టపరిహారం చెల్లిలంచాలని డిమాండ్ చేశాయి. దీంతో మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అంశం కీలక మలుపు తిరిగింది. దాదాపు మూసీ పరివాహక గ్రామాలు 100 ఏకమయయ్యాయి. మూసీ పరిరక్షణ సమితి పేరుతో ఒక కమిటీగా ఏర్పడి.. తమ స్వరం వినిపించాయి. ఇందులో భాగంగానే మూసీ ప్రాజెక్ట్‌ కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి తమ మెమోరాండం అందించింది. అంతేకాకుండా తీవ్రమైన కాలుష్యం కారణంగా తీవ్ర ప్రభావాన్ని ఎదర్కొన్నా గ్రామాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఈ సమికి ఆన్‌లైన్‌లో ఒక పిటిషన్‌కు కూడా దాఖలు చేసింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు ఇచ్చిన నివేదికలో గ్రామస్థులు తమ కష్టాలను వివరించారు. 1985 నుంచి నగరాల మురుగు, పరిశ్రమల వ్యర్థాలు మూసీ నదిని తీవ్రంగా కలుషితం చేశాయని పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ జీవనోపాధులు దాదాపు నిలిచిపోయాయని తెలిపారు. సమితి అధ్యక్షుడు బట్టే శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో వందకు పైగా మహిళలు గర్భస్రావాలకు గురయ్యారని చెప్పారు. పశువులు సంతానం ఇవ్వడం తగ్గిపోయిందని, గొర్రెలు, మేకలు కూడా పెరగడం లేదని పేర్కొన్నారు.

గ్రామాల చెరువుల్లో చేపలు కనిపించడం మానేశాయని తెలిపారు. మత్స్యకారులు పట్టణాల నుంచి చేపలు కొనాల్సి వస్తోందని చెప్పారు. రైతులకు చర్మవ్యాధులు పెరిగాయని, పంట నాణ్యత తగ్గి 40 శాతం వరకు నష్టమవుతోందని వెల్లడించారు. కలుషిత నీటితో తాటి, ఈత చెట్ల కల్లు కూడా ప్రభావితమైందని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గ్రామాలు పది కీలక సూచనలు సమర్పించాయి. మంత్రుల బృందం ప్రత్యక్షంగా గ్రామాలను సందర్శించాలని కోరారు. ప్రాజెక్టులో తమను భాగస్వాములుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టు పరిధిని గౌరెల్లి నుంచి సూర్యాపేట ప్రాజెక్టు వరకు విస్తరించాలని కోరారు. దిగువన ఉన్న సుమారు 70 గ్రామాలకు ₹1000 కోట్ల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రతి గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. నిజాం కాలం నాటి కట్వాలు, కాలువలను మరమ్మతు చేయాలని సూచించారు. కాలుష్యంతో నిండిన చెరువులను శుభ్రం చేయాలని, మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. యాదవులకు ఆర్థిక సాయం, ఆరోగ్య కేంద్రాల మెరుగుదలపై కూడా డిమాండ్లు చేశారు.

ఇక ప్రాజెక్టు వల్ల ఇళ్ల కూల్చివేతలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. వేలాది కుటుంబాలు నిర్వాసితులు కావచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు గ్రామాలను సందర్శించలేదని కూడా పేర్కొన్నారు. ఇటీవల మానవ హక్కుల ఫోరం కార్యకర్తలు గ్రామాలను సందర్శించి ప్రాజెక్టు వివరాలు చెప్పినట్లు వినతిలో తెలిపారు. గౌడ్, యాదవ, శాలివాహన, ముదిరాజ్, దళిత, నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఈ వినతిపై సంతకం చేశారు.

తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లినందుకు సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్థులు, ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ వినతిపై కేబినెట్ ఉపసమితి త్వరలో సమీక్ష చేయనుంది. మూసీ సుందరీకరణ కోసం ₹41,000 కోట్ల రుణం తీసుకునే ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. ప్రారంభ పనులు గండిపేట్, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి.

Read More
Next Story