తెలంగాణలో నర్సంపేట ’డ్రైవర్’ ఆత్మహత్య సంచలనం
x
deceased RTC Driver Kola Sankar Goud

తెలంగాణలో నర్సంపేట ’డ్రైవర్’ ఆత్మహత్య సంచలనం

చికిత్స పొందుతు శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో గౌడ్ మరణించారు.


ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ మరణించారు. గురువారం మధ్యాహ్నం డిపోలోనే గౌడ్ ఒంటిపైన పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తు ఆర్టీసీలోని కార్మిక, ఉద్యోగ సంఘాలు బుధవారం నుండి సమ్మెచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రఆగ్రహం వ్యక్తంచేసిన కోలా గురువారం మధ్యాహ్నం డిపోదగ్గరే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో వెంటనే సహచర కార్మికులు, పోలీసులు గౌడ్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేర్పించారు. అర్ధరాత్రి సమయంలో పరిస్ధితి విషమించటంతో ఎంజీఎం నుండి హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడే చికిత్స పొందుతు శుక్రవారం తెల్లవారిజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో గౌడ్ మరణించారు. 80శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన గౌడ్ ను బతికించేందుకు డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. గౌడ్ గడచిన 25 ఏళ్ళుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. గౌడ్ విషయం పక్కనపెట్టేస్తే మిర్యాలగూడ డిపోలోని డ్రైవర్ వెంకన్న కూడా ఒంటిపై డీజల్ పోసుకోవటాన్ని గమనించిన తోటి కార్మికులు అడ్డుకున్నారు. భద్రాచలం డిపోలో డ్రైవర్ లింగారెడ్డి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమ్మె ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యలకు ప్రయత్నిచంటం సంచలనంగా మారింది. గతంలో కూడా చాలా విభాగాల్లోని ఉద్యోగులు సమ్మెచేశారు కాని ఆత్మహత్యలకు ప్రయత్నించలేదు.

2014కు ముందు తెలంగాణ సాధనలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఇపుడు ఆర్టీసీ సమ్మెలో అలాంటి ఆత్మహత్యల ఘటనలు మొదలయ్యాయి. తమ చావుతో అయినా ప్రభుత్వంలో చలనం వచ్చి డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తుందన్న ఆలోచనతోనే కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యలకు ప్రయత్నించేముందు ఒక్కసారి తమపై ఆధారపడిన కుటుంబసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటే మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయరు.

రేవంత్ భరోసా

శంకర్ గౌడ్ మృతిచెందిన వార్త వినగానే రేవంత్ స్పందించారు. గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడుతు కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకుని సాధించేది ఏమీ ఉండదని తెలిపారు. శంకర్ గౌడ్ చనిపోయిన విషయం తెలియగానే ప్రతిపక్షాలు ఆసుపత్రికి క్యూ కట్టారు. గౌడ్ ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యంటు రెచ్చిపోతున్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతు గౌడ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గౌడ్ మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. రెండేళ్ళుగా డిమాండ్ల పరిష్కారాన్ని ప్రభుత్వ గాలికి వదిలేయటం, కార్మికులపై ప్రభుత్వం బెదిరింపులకు దిగటం వల్లే ఇపుడు ఈ పరిస్ధితి తలెత్తిందన్నారు. గౌడ్ అంత్యక్రియలకు హాజరుకాబోతున్నట్లు బండి తెలిపారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తదితరులు కూడా గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతగా మండిపడ్డారు. మృతదేహాన్ని చూడటానికి తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం మీద ఆరోపణలతో విరుచుకుపడటానికి, బురదచల్లేయటానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటాయి అనటంలో సందేహంలేదు. ఇపుడు కూడా బీఆర్ఎస్, బీజేపీ, కవిత అదే చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు మరచిపోయిన విషయం ఇంకోటుంది. అదేమిటంటే నరేంద్రమోదీ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. అయితే ఆ మూడువ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు ఢిల్లీ-హర్యానా జాతీయ రహదారిపై రెండేళ్ళ క్రితం రైతులు సుమారు 50 రోజులు పెద్దఎత్తున ఆందోళనచేశారు. అప్పట్లో 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయస్ధాయిలో పెద్ద వివాదం అయి చివరకు సుప్రింకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నది. అప్పుడు 12 మంది రైతుల ఆత్మహత్యలకు మోదీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు.

అలాగే కేసీఆర్ హయాంలో కూడా డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మూడుసార్లు సమ్మెచేశారు. ఒకసారి అయితే ఏకంగా 54 రోజులు జరిగింది. అప్పట్లో ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ కూడా చూపలేదు. దాంతో ఇద్దరు కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేశారు. అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం చలించలేదు. సమ్మె విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు కూడా ఇష్టపడలేదు. దాంతో వేరేదారిలేక ఉద్యోగులు, కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరారు. సమ్మె సమయంలో కొంతమంది మరణించారు. అప్పట్లో ఆ మరణాలకు కేసీఆర్ ప్రభుత్వ బాధ్యత వహించలేదు. బలవన్మరణాలు ఎప్పుడూ బాధాకరమే అనటంలో సందేహంలేదు. కాకపోతే ఆత్మహత్యలు చేసుకునేట్లుగా కొందరిని ప్రేరేపించటం ఆ మంటల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయటమే అత్యంత బాదాకరం. ప్రభుత్వాలు కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలోకి దిగేంతవరకు సానుకూలంగా స్పందించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Read More
Next Story