
మన నవనీతానికి నోబెల్ !
అంతర్జాతీయ న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన నవీ పిళ్లేకు 2026 నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించారు.
న్యాయం, శాంతి కోసం అంతర్జాతీయ స్థానాల వరకు భారత మూలాలున్న మహిళ నవీనతం పిళ్లై చేసిన పోరాటినికి గుర్తింపు లభించింది. ఆమె పోరాటానికి గౌరవంగా నోబెల్ శాంతి బహుమతి అందింది. ఈ విషయాన్ని నోబెల్ ప్రైజ్ 2026 శుక్రవారం ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాల అమలు, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించారు.
అసలెవరీ నవనీతం
నవనీతం ‘నవీ’ పిళ్లే దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో తమిళ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్రం చదివిన ఆమె వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలకు న్యాయస్థానాల్లో అండగా నిలిచారు. నెల్సన్ మండేలా సహా పలువురు ఉద్యమకారుల తరఫున న్యాయపోరాటం చేశారు. 1967లో సొంతంగా న్యాయ సంస్థను ప్రారంభించారు. 1980లలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1988లో జ్యూరిడికల్ సైన్స్‌లో డాక్టరేట్ పొందారు. 1995లో దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1999లో రువాండా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆ సంస్థ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.
అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కీలక పాత్ర
రువాండా ట్రిబ్యునల్‌లో పనిచేసిన సమయంలో లైంగిక హింస, అత్యాచారం, విద్వేష ప్రచారం వంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇలాంటి నేరాలు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమం కేసుల్లో అభియోగాలకు దారితీయవచ్చనే అంశాన్ని స్థిరపరచడంలో ఆమె కృషి చేశారు. తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేశారు.
2019లో అంతర్జాతీయ న్యాయస్థానంలో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మయన్మార్‌పై మారణహోమం ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. 2021 నుంచి 2025 వరకు ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు అధ్యక్షత వహించారు.
న్యాయం చేయడమే లక్ష్యం
తన కెరీర్లో నవీ పిళ్లే అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. హింస, ఘర్షణల బాధితులకు న్యాయం అందించడంతోపాటు ప్రభుత్వాలు, నాయకులు చట్టాలకు లోబడి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. శాంతి, న్యాయం సాధించడంలో అంతర్జాతీయ చట్టాల ప్రాధాన్యాన్ని చాటారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 287 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు నామినేషన్లలో ఉన్నాయి. గత ఏడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ఈ పురస్కారం దక్కింది. ప్రజాస్వామ్య మార్పు కోసం ఆమె చేసిన పోరాటాన్ని నోబెల్ కమిటీ గుర్తించింది.

