
నీట్‌పై పొలిటికల్ హీట్! కాంగ్రెస్–బీజేపీ పోటాపోటీ నిరసనలు
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) నీట్‌పై పొలిటికల్ హీట్! కాంగ్రెస్–బీజేపీ పోటాపోటీ నిరసనలు
2) డెలివరీ ఆగింది. రైడ్‌కు బ్రేక్.. గిగ్ వర్కర్స్ గర్జన..!
3) కరోనా సైలెంట్ ఎంట్రీ..?పరీక్ష చేయడానికి టెస్టు కిట్లు లేవా..
1) నీట్‌పై పొలిటికల్ హీట్! కాంగ్రెస్–బీజేపీ పోటాపోటీ నిరసనలు
తెలంగాణాలోనూ నీట్ పరీక్ష వివాదం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం, అరెస్టులు, వాగ్వాదాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసనలకు సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ "ఛలో లోక్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అక్కడి నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. నీట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ... కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతసేపు కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీజేపీ కౌంటర్... గాంధీ భవన్ ముట్టడి యత్నం
కాంగ్రెస్ నిరసనలకు బీజేపీ కూడా ఎదురుదాడి చేసింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారినీ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నగరంలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఒకే రోజు రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీగా నిరసనలు చేపట్టడంతో హైదరాబాద్‌లో రాజకీయ వేడి కనిపించింది.
కొడంగల్‌లో సి.ఎం. నిరసన
ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొడంగల్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ప్రజల ఆందోళనలను గౌరవించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని కూడా కోరారు. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్ వ్యవహారం ఇప్పుడు కేవలం విద్యా సమస్యగా కాకుండా... దేశవ్యాప్త రాజకీయ అంశంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ఈ అంశంపై నిరసనలను మరింత ఉధృతం చేస్తుండగా మరోవైపు బీజేపీ కూడా ఎదురుదాడికి సిద్ధమవుతోంది. పార్లమెంట్ నుంచి రాష్ట్రాల వరకు ఈ అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు, కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీ నిరసనలు, ఇవన్నీ కలిసి ఈ వివాదాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందా? విద్యార్థుల ఆందోళనలకు పరిష్కారం దొరుకుతుందా? అనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
2) డెలివరీ ఆగింది. రైడ్‌కు బ్రేక్.. గిగ్ వర్కర్స్ గర్జన..!
ఈ రోజు తెలంగాణలో గిగ్ వర్కర్లు తమ ఆందోళనను మరోసారి బలంగా వినిపించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు "బ్రేక్‌డౌన్ ఫ్లాష్ సమ్మె" నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ భాగస్వాములు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.
ఈ సమ్మెలో ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లతో పాటు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన వర్కర్లు కూడా పాల్గొన్నారు. యూనియన్ నాయకుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా క్యాబ్, ఆటో, ఫుడ్ డెలివరీ సేవలు పీక్ అవర్స్‌లో పాక్షికంగా నిలిచిపోయాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు. లేకపోతే ఆగస్టు 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, ఓలా, ఉబెర్, ర్యాపిడో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి యాప్‌ల ద్వారా సేవలు అందించే వారినే గిగ్ లేదా ప్లాట్‌ఫామ్ వర్కర్లు అంటారు. వీరు కంపెనీల శాశ్వత ఉద్యోగులు కాదు. "పార్ట్‌నర్లు" లేదా "ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు"గా పరిగణిస్తారు. అందువల్ల ఉద్యోగులకు లభించే పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, చెల్లింపు సెలవులు వంటి ప్రయోజనాలు వీరికి సాధారణంగా ఉండవు.
గిగ్ వర్కర్ల ప్రధాన ఆవేదన ఏమిటంటే, ఆదాయం తగ్గిపోవడం.కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కో రైడ్ లేదా డెలివరీకి లభించిన పారితోషికంతో పోలిస్తే ఇప్పుడు చెల్లింపులు గణనీయంగా తగ్గాయని వారు చెబుతున్నారు.
అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వాహనాల నిర్వహణ, బీమా, మొబైల్ డేటా, సర్వీసింగ్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. కానీ తమ ఆదాయం మాత్రం పెరగలేదని వాపోతున్నారు.
ఇన్సెంటివ్ విధానాలు తరచూ మారుతున్నాయని, ఎక్కువ గంటలు పనిచేసినా ఆశించిన ఆదాయం రావడం లేదని కూడా చెబుతున్నారు.అకౌంట్ బ్లాక్... మరో ప్రధాన సమస్యగిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అకౌంట్ సస్పెన్షన్.
ఒక్క కస్టమర్ ఫిర్యాదు వచ్చినా... లేదా యాప్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ముందస్తు నోటీసు లేకుండానే అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.దాంతో ఒక్కసారిగా వారి ఆదాయం పూర్తిగా ఆగిపోతోందని, అప్పీల్ చేసుకునే పారదర్శక వ్యవస్థ కూడా లేదని చెబుతున్నారు.
సామాజిక భద్రత లేకపోవడంపై ఆందోళనరోజూ గంటల తరబడి రోడ్లపై ప్రయాణించే గిగ్ వర్కర్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ.ప్రమాదాల్లో గాయపడినా... మరణించినా... కుటుంబాలకు సరైన ఆర్థిక భరోసా లేదని సంఘాలు చెబుతున్నాయి.
అందుకే ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ, కుటుంబాలకు పరిహారం వంటి సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు:
గిగ్ వర్కర్లకు కార్మికులుగా అధికారిక గుర్తింపు.
కిలోమీటర్‌కు, నిమిషానికి ప్రభుత్వం కనీస ఛార్జీలు నిర్ణయించడం.
ప్రతి రైడ్, డెలివరీకి కనీస హామీ చెల్లింపు.
ఇంధన ధరలకు అనుగుణంగా చెల్లింపుల సవరణ.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేయడం.
గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు.
పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా వంటి సామాజిక భద్రత.
అకౌంట్ సస్పెన్షన్‌కు ముందు నోటీసు, అప్పీల్ అవకాశం.
గిగ్ వర్కర్ల సంఘాల ప్రకారం తమ సమస్యలపై ప్రభుత్వంతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ఈ హెచ్చరిక సమ్మె చేపట్టామని చెబుతున్నారు.
ఈ సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
సమ్మె ప్రభావం:
ఈ 12 గంటల సమ్మె కారణంగా...ఓలా, ఉబెర్, ర్యాపిడో సేవలకు అంతరాయం ఏర్పడింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో డెలివరీలు ఆలస్యమయ్యాయి. పీక్ అవర్స్‌లో క్యాబ్‌లు దొరకడం కష్టమైంది. ప్రయాణికులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్–2020లో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు ప్రత్యేక నిర్వచనం ఇచ్చింది. అయితే ఆ చట్టం ద్వారా అందాల్సిన సామాజిక భద్రతా ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
అందుకే గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించేలా స్పష్టమైన విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు కీలక శక్తిగా మారారు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ వర్గానికి న్యాయమైన పారితోషికం, కార్మిక హక్కులు, సామాజిక భద్రత కల్పించాలన్న డిమాండ్ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. మరోవైపు కంపెనీలు వ్యాపార నిర్వహణ, పోటీ పరిస్థితులు, సాంకేతిక ఆధారిత చెల్లింపు విధానాలను ప్రస్తావిస్తున్నాయి. ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుంది? ఆగస్టు 8కు ముందే పరిష్కారం దొరుకుతుందా? లేక రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె తప్పదా? అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
3) కరోనా సైలెంట్ ఎంట్రీ..?పరీక్ష చేయడానికి టెస్టు కిట్లు లేవా..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొవిడ్ కేసులు నమోదవుతుండగా, కరోనా కారణంగా నలుగురు మరణించినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు తెలంగాణలో అధికారికంగా కొవిడ్ కేసులు లేవని ప్రజారోగ్య శాఖ చెబుతున్నప్పటికీ... వైద్యవర్గాలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నాయి. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరగకపోవడం వల్లే కేసులు బయటపడడం లేదని వారు అంటున్నారు.జలుబు, జ్వరం కేసులు పెరుగుతున్నాయా?
గత నెల రోజులుగా హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో వచ్చే రోగుల సంఖ్య పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో కొందరికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా చోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని సమాచారం. దీంతో వైరస్ ఉన్నా నిర్ధారణ కాకుండానే కేసులు మిగిలిపోతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో గాంధీ ఆస్పత్రిలో ఒక కొవిడ్ కేసు నమోదైనట్లు వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సీటీ చెస్ట్ స్కాన్ చేయించుకోగా, ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అనంతరం కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. తర్వాత ఆమె వైద్య నివేదికలను పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు... కొవిడ్ ప్రభావంతోనే ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
టెస్టు కిట్లు లేవా?
వైద్యవర్గాల సమాచారం ప్రకారం... ప్రస్తుతం తెలంగాణలో కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం అవసరమైన టెస్టు కిట్లు అందుబాటులో లేవని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా కరోనా తీవ్రత తగ్గడంతో టెస్టు కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోళ్లను తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగితే, తగిన పరీక్షలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐసీఎంఆర్ ఏమంటోంది?
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా శ్వాసకోశ వైరస్‌లపై నిరంతరం నిఘా నిర్వహిస్తోంది. జూన్ మొదటి వారం నుంచి దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్ నివేదికలు సూచిస్తున్నాయి. జూలై మొదటి వారంలో పరీక్షించిన 162 నమూనాల్లో 58 కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఐసీఎంఆర్ డ్యాష్‌బోర్డ్‌లో వెల్లడించింది. మిగతా నమూనాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఉన్నట్లు పేర్కొంది.కొవిడ్ తీవ్రతపై అధికారిక హెచ్చరికలు లేకపోయినా... జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ... తెలంగాణలో పరీక్షలు జరగకపోవడం, టెస్టు కిట్లు అందుబాటులో లేవన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం కొవిడ్ నిఘా, పరీక్షలు, వైద్య సన్నద్ధతపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

