
నేపాల్‌లో భయానక వరదలు.. కళ్లముందే కొట్టుకుపోయిన ఇళ్లు
నేపాల్‌లో భీకర వరదలు, కొండచరియలతో భారీ విధ్వంసం. ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన భయానక అనుభవాలు, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు.
నేపాల్‌లో ప్రకృతి విలయం సృష్టించింది. భోట్ కోసి వరద ఉధృతికి ఇళ్లు, వంతెనలు, నివాస ప్రాంతాలు కళ్లముందే కొట్టుకుపోయాయి. వందలాది మంది మృతి చెందగా.. మరెందరో గల్లంతయ్యారు. రక్షణ చర్యలు కొనసాగుతున్న వేళ.. ప్రాణాలతో బయటపడిన వారి భయానక అనుభవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో రాజు బుధాథోకీ తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక్కసారిగా కొండ కంపించింది. భూకంపం వచ్చిందని భావించిన ఆయన బయటకు పరుగెత్తారు.
అక్కడి పోలీసులూ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తుండటాన్ని చూశారు. వైర్ కంచె దాటే సమయంలో ఆయన చేతికి గాయమైంది. అయినా ఆగలేదు. పైకి పరుగెత్తి వెనక్కి చూసినప్పుడు.. టిమురే మార్కెట్‌లోని ఇళ్లు ఒక్కొక్కటిగా వరదలో కొట్టుకుపోతున్నాయి. చివరకు సుమారు 500 మీటర్ల ఎత్తులోని అడవికి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఆసుపత్రి నుంచి మాట్లాడిన బుధాథోకీ.. తనకు జీవితంలో రెండో అవకాశం లభించినట్టుగా అనిపిస్తోందని చెప్పారు. అక్కడి పరిస్థితి ఇప్పటికీ భయంకరమైన కలలా ఉందని వివరించారు.
అదే ప్రాంతానికి చెందిన మరో కస్టమ్స్ ఏజెంట్ ప్రకాశ్ గౌతమ్‌దీ ఇలాంటి అనుభవమే. మొదట భారీ శబ్దం వినిపించింది. కొద్దిసేపటికే మార్కెట్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఆకాశం నల్లటి మేఘంతో కప్పుకుపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక గౌతమ్ గది నుంచి బయటకు పరుగెత్తారు. ఎటు వెళ్లాలో తెలియక.. ప్రాణాలు కాపాడుకోవడమే లక్ష్యంగా అడవివైపు వెళ్లారు. అక్కడి నుంచి చూసిన దృశ్యం మరింత భయానకంగా కనిపించింది. వరదలో మృతదేహాలు కొట్టుకుపోతున్నాయి.
అందంగా కనిపించే టిమురే ప్రాంతం శిథిలాలుగా మారిపోయింది. ఇళ్లు, నివాస ప్రాంతాల స్థానంలో ఇసుక, బురద మాత్రమే మిగిలింది. గౌతమ్‌తో పాటు మరికొందరిని బుధవారం రాత్రి కూడా రక్షించలేకపోయారు. అడవిలోనే ఉండిపోయారు. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ నుంచి పడేసిన నూడుల్స్ ప్యాకెట్లతో రాత్రి గడిపారు. గురువారం ఉదయం సుమారు 10 గంటలకు హెలికాప్టర్ చేరుకుంది. వారిని బిదూర్‌కు తరలించింది. హెలికాప్టర్ ఎక్కిన తర్వాతే తాను నిజంగా ప్రాణాలతో బయటపడ్డాననే భావన కలిగిందని గౌతమ్ తెలిపారు.
దోలఖాకు చెందిన తులసీ బహదూర్ భండారీ కూడా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కసారిగా నల్లటి బురద, నీరు ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఇళ్లు వరుసగా కూలిపోయాయి. వరద ప్రవాహం భండారీని బలంగా కొట్టింది. అయితే ఆయనను కొండ వాలు వైపు విసిరేసింది. అదే తన ప్రాణాలను కాపాడిందని ఆయన చెప్పారు. ఇక బిదూర్, త్రిశూలి, ఖాట్మండులోని ఆసుపత్రులు, ఆశ్రయ కేంద్రాల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గాయాలతో పాటు తమ ఇళ్లు, బంధువులు, స్నేహితులను కోల్పోయిన బాధను వారు మోస్తున్నారు.
వరద నుంచి తప్పించుకునే సమయంలో కొందరు బురద, ఇసుకలో కూరుకుపోయారని రామ్ కుమార్ రాణా తెలిపారు. హెలికాప్టర్ల సహాయంతో వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. చిన్నారులు భయంతో పరుగులు తీస్తూ కిందపడి గాయపడ్డారని వివరించారు. మరోవైపు గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. నువాకోట్ జిల్లా త్రిశూలిలోని సైనిక్ మైదాన్ వద్ద గురువారం పలువురు కుటుంబాలు చేరుకున్నాయి. తమ వారి వివరాలను అధికారులకు అందించాయి.
రసువాకు చెందిన మరో బాధితుడు మాత్రం తమ ప్రాంతంలో ఏమీ మిగలలేదని తెలిపారు. తన తల్లిదండ్రులు కూడా గల్లంతయ్యారని చెప్పారు. వరదకు ముందు నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు తరలిపోవాలంటూ హెచ్చరికలు వచ్చినట్లు కొందరు తెలిపారు. అయితే బయటకు వెళ్లేందుకు సమయం సరిపోలేదని చెప్పారు. ఒకప్పుడు అక్కడ రెండు వంతెనలు ఉండేవని.. ఇప్పుడు కొన్ని ఇళ్లు మాత్రమే మిగిలాయని ఓ స్థానికుడు వివరించారు.
రసువా, ధాదింగ్, నువాకోట్, చిత్వన్ జిల్లాల్లో నేపాల్ ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత ఇంకా రాలేదు. దాదాపు వెయ్యి మంది వరకు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టిబెట్ ప్రాంతంలో ప్రారంభమైన వరద భోట్ కోసి, త్రిశూలి నదీ వ్యవస్థల్లోకి ప్రవహించింది. మార్గంలో వంతెనలు, స్థానిక నిర్మాణాలు కొట్టుకుపోయాయి. మౌలిక వసతులకు భారీ నష్టం జరిగింది.
బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ధ్వంసమైన ప్రాంతాలను తిరిగి నిర్మించడం పెద్ద సవాలుగా మారింది. దీనికి సమయం పడుతుందని నేపాల్ పార్లమెంట్ సభ్యుడు ఖగేంద్ర సునార్ తెలిపారు. ఈ విపత్తు ప్రభుత్వానికే పరిమితం కాకుండా అందరి బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విపత్తు విదేశీయులనూ ప్రభావితం చేసింది. 30కి పైగా దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన వారిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 288 మంది భారతీయులు కూడా ఉన్నారు.
రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారు మాత్రం ఇప్పుడు మరో పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. వరద నుంచి తప్పించుకున్నా.. తిరిగి వచ్చినప్పుడు తమ ఇళ్లు, పని ప్రదేశాలు, పరిచయమైన ప్రాంతాలు కనిపించని పరిస్థితి నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుండగా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా కొనసాగుతున్నాయి.

