
నేపాల్ వరదల్లో 170 మంది తెలంగాణ వాసులు గల్లంతు?
నేపాల్ వరదల్లో 590 మంది విదేశీయులు గల్లంతు. వారిలో 300 మంది భారతీయులు. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
నేపాల్‌లో భారీ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది మంది భారతీయుల ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తాజా సమాచారం ప్రకారం 590 మంది విదేశీయులు గల్లంతయ్యారు. వీరిలో 177 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. అయితే ఆ సంఖ్య దాదాపు 300 వరకు ఉండొచ్చని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. ముఖ్యంగా కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయులే ఎక్కువగా ఉన్నారు. కాగా గల్లంతయిన వారిలో దాదాపు 170 మంది వరకు తెలంగాణ వాసులు ఉన్నట్లు సమాచారం. వారి ఆచుకీ కోసం అధికారులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం వరకు కలిసిన ఫోన్లు.. అర్థరాత్రి నుంచి కలవడం లేదని తెలుస్తోంది.
టిబెట్ వైపు నుంచి భోటే కోషి నదిలో వరద ఉధృతి పెరగడంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. రసువా, ధాదింగ్ జిల్లాలతో పాటు కాఠ్మాండు సమీపంలోని నువాకోట్ ప్రాంతం కూడా ప్రభావితమైంది. వరదలకు ఇళ్లు, రహదారులు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. కనీసం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రభావితమైనట్లు సమాచారం.
తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ అధికారులు విదేశాంగ శాఖ, ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు వెంటనే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ నంబర్లు:
9871999044
9949351270
9618597969
సంప్రదించే సమయంలో బాధితుడి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ఉన్న ప్రాంతం వంటి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ట్రావెల్ లేదా టూర్ ఆపరేటర్ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు కూడా ఇవ్వాలని తెలిపింది. అందిన సమాచారాన్ని ప్రాధాన్యత ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనుంది.
సద్గురు టీం గల్లంతు..
సద్గురు ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులతో కూడా సంబంధాలు తెగిపోయాయి. ఈ బృందం కైలాష్ మానస సరోవర్ యాత్ర ముగించుకుని కాఠ్మాండుకు తిరిగి వస్తుండగా వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ బృందంలో భారతీయులతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూరప్, ఆసియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
భారత ప్రభుత్వం సహాయక చర్యలు
నేపాల్‌లో పరిస్థితిపై భారత్ స్పందించింది. కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న భారతీయులకు సహాయం అందించేందుకు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర ‘బాలెన్’ షాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలకు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన సీ-130జే విమానం ద్వారా 10 టన్నుల సహాయ సామగ్రి, అత్యవసర మందులను నేపాల్‌కు పంపించారు. తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ ల్యాంపులు, మందులు ఇందులో ఉన్నాయి. నేపాల్‌లో గల్లంతైన భారతీయుల సంఖ్యపై భిన్నమైన వివరాలు వెలువడుతున్నాయి. ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తోంది. బాధిత కుటుంబాలు అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి అవసరమైన వివరాలు అందించాలని ప్రభుత్వం సూచించింది.

