
గ్యాస్ బుకింగుకు కొత్త రూల్స్ తెలుసా ?
పెట్రోల్ తో పాటు గ్యాస్ బండలకు కూడా దేశంలో కొరత ఉందన్న విషయం అర్ధమవుతోంది
దక్షిణాసియా యుద్ధ వాతావరణం నేపధ్యంలో గల్ఫ్ దేశాల నుండి పెట్రోల్, గ్యాస్ సరఫరా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా రెండింటికి కొరత పెరిగిపోతోంది. ఒకవైపు కేంద్రమంత్రులు మాత్రం పెట్రోల్, గ్యాస్‌కు ఎలాంటి కొరతలేదని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం వివిధ కారణాలతో పెట్రోల్ బంకులదగ్గర జనాలు బారులుతీరుతున్నారు. ఈ నేపధ్యంలోనే గ్యాస్‌బండ బుకింగుకు కేంద్రప్రభుత్వం కొత్తనిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు మే 1వ తేదీనుండి అమల్లోకి వచ్చేశాయి. దీంతోనే పెట్రోల్ తో పాటు గ్యాస్ బండలకు కూడా దేశంలో కొరత ఉందన్న విషయం అర్ధమవుతోంది.
గ్యాస్ బండల బుకింగ్, సరఫరా, దుర్వినియోగ నివారణ తదితరాల కోసమే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం గతంలో పట్టణ ప్రాంత వినియోగదారులకు సిలిండర్ల బుకింగ్ మధ్య వ్యవధి 21 రోజులుండేది. ఇపుడు ఆ వ్యవధిని 25 రోజులకు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు సిలిండర్ల మధ్య గ్యాస్ బండ బుకింగ్ వ్యవధిని 45 రోజులకు పెంచింది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుడి మొబైల్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ డెలవరీ రోజున వన్ టైమ్ పాస్ వర్డ్ ను డెలవరీ బాయ్ కు చెప్పాల్సుంటుంది. ఏ కారణం వల్లయినా పాస్ వర్డ్ చెప్పకపోతే డెలవరీ విషయంలో సమస్యలు తలెత్తుతుంది.
అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ఆధార్ ఆధారిత కేవైసీని కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఎల్పీజీ, పైప్డ్ నాచురల్ గ్యాస్ రెండూ ఉపయోగించుకుంటున్న వినియోగదారులకు ఇకనుండి ఏదో ఒకటి మాత్రమే అందుబాటులో ఉంచాలని కేంద్రం డిసైడ్ చేసింది. రెండింటిలో దేన్ని ఉంచుకోవాలన్న విషయాన్ని వినియోగదారుడే నిర్ణయించుకోవాలి. ఇప్పటికే పైప్డ్ నాచురల్ గ్యాస్ వాడుకుంటున్న వాళ్ళకు గ్యాస్ బుకింగ్ అవకాశం లేదు. భవిష్యత్తులో గ్యాస్ బండకు బదులు కేంద్రప్రభుత్వం పైప్డ్ నాచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రమోట్ చేయలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకనే రెండు కనెక్షన్లున్న వారికి ఎల్పీజీని సరెండర్ చేయాలని చెబుతోంది.
ఈ గ్యాస్ కొరత ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా, ఇజ్రాయోల్-ఇరాన్ యుద్ధం ముగిసినా వెంటనే గ్యాస్ సరఫరా మొదలైపోదన్న విషయం అందరికీ తెలిసిందే. యుద్ధం ముగిసినా దానితాలూకు దుష్ఫలితాలు కొంతకాలం కంటిన్యు అవుతుంది. గ్యాస్, చమురు సరఫరా మళ్ళీ యధాతధ స్ధితికి చేరుకోవటానికి చాలాకాలమే పట్టేట్లుంది. అప్పటివరకు గ్యాస్, పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు తప్పేట్లు లేదు.

