
సైబర్ మోసాల పట్ల అలెర్ట్ : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక
కొత్త ఏడాది, కొత్త మోసాలు: తెలంగాణలో విజృంభిస్తున్న సైబర్ నేరాలు
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ: తెలంగాణలో భయపెడుతున్న సైబర్ మాఫియా
కొత్త సంవత్సరం మొదలైంది… కానీ కొత్త ఆశలతో పాటు కొత్త సైబర్ మోసాల ముప్పు కూడా మొదలైంది. 2026లో సైబర్ నేరగాళ్లు మరింత తెలివిగా, మరింత ప్రమాదకరంగా మారారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పండుగ కానుకలు, ట్రాఫిక్ చలాన్లు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సామాన్యులే కాదు, ఉన్నతాధికారుల కుటుంబాలే సైతం సైబర్ మోసాల బారిన పడుతున్నాయి.
- ఒక్క క్లిక్… ఒక్క నమ్మకం… అంతే జీవితకాలపు పొదుపు గాల్లో కలిసిపోతోంది. కొత్త ఏడాదిలో సైబర్ నేరాలు భయంకరంగా పెరిగాయి. తెలంగాణలో రోజుకో నయా సైబర్ మోసం వెలుగుచూస్తోంది.
- కొత్త సంవత్సరం 2026లో సైబర్ నేరాలు పెరిగాయి. కొత్త సంవత్సరం సైబర్ నేరగాళ్లు కొత్త తరహా సైబర్ మోసాలకు తెరలేపారు. 19 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, 8 డిజిటల్ అరెస్ట్, 3 సోషల్ మీడియా ఫ్రాడ్, బిజినెస్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, హ్యాకింగ్, ప్రైవసీ కేసులు వెలుగుచూశాయి.
సీబీఐ మాజీ జేడీ భార్యకే మోసం
సైబర్ కేటుగాళ్లు ఏకంగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయిన ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊరిళకే స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరిట డబ్బు స్వాహా చేశారు. ఊర్మిళ వాట్సాప్ నంబరుకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఊహించని లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి రూ.2.58 కోట్లను సైబర్ నేరస్థులు స్వాహా చేశారు.
కానుక పేరిట నయా మోసం
సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో మోసాలు చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో "ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయని చెప్పారు. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాళ్లు ఆశపెడుతున్నారని సీపీ హెచ్చరించారు.
షేర్ మార్కెట్ పెట్టుబడి పేరిట రూ.2.9 కోట్లు స్వాహా
శేరిలింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి 2025 డిసెంబర్ 15వ తేదీన తొలిసారిగా 50 వేల రూపాయలు షేర్ మార్కెట్ పెట్టుబడిగా పెట్టాడు. వెంటనే 5 వేల రూపాయల లాభం వచ్చింది. దీంతొ మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా పలు మార్లు మొత్తం 2.9 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. పెట్టుబడి, లాభం కలిపి రూ.3.47 కోట్లకు చేరినట్లు యాప్‌లో కనిపించేది.నకిలీ యాప్‌లో తనతో పెట్టుబడులు పెట్టించి డబ్బు కొట్టేశారని గుర్తించి సైబర్ సెక్యూరిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రాఫిక్ చలాన్ల పేరిట ఘరానా మోసం
ట్రాఫిక్ చలాన్ల పేరు చెప్పి మరో మోసం తెరపైకి వచ్చింది.తాజాగా ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి మొబైల్ ఫోన్ కు సైబర్ నేరస్థులు.. 'మీ వాహనం అతివేగంతో వెళ్లడం కెమెరాలో గుర్తించామంటూ' రెండు సందేశాలు పంపారు. ఆ మెసేజ్ లలో మీ వాహనానికి సంబంధించిన చనాన్ల వివరాలు చూడాలంటే తాము పంపిన లింక్ లపై క్లిక్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో వాటిని క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకొని బ్యాంకు ఖాతాలో సొమ్మంతా మాయం చేస్తారని డీసీపీ శిల్పవల్లి చెప్పారు.
పెరిగిన సైబర్ నేరాలు
తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదిక ప్రకారం సైబర్ నేరాలు పెరిగాయని తెలంగాణ జైళ్ల డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా వెల్లడించారు.2025వ సంవత్సరంలో సైబర్ నేరాల కేసులు 135శాతం కంటే ఎక్కువగా పెరిగి అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయని ఆమె తెలిపారు.
రోజుకో నయా సైబర్ మోసం
రోజుకో నయా సైబర్ మోసం వెలుగుచూస్తోంది. సైబర్ మోసగాళ్ల బారిన పడవద్దంటూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పరిధిలో సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా బాధితులు సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడుతూనే ఉన్నారు. ఇతర నేరాల కంటే సైబర్ మోసాలు పెరిగాయి.
ఎన్నెన్నో రకాల మోసాలు
ఉచితంగా రూ. 5వేలు ఇస్తామంటూ లింక్ పంపించి డబ్బు స్వాహా చేస్తున్నారు. చివరకు యూపీఐ ఖాతాల నుంచి డబ్బు క్రెడిట్ చేసి, లింకులు పంపి బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాలు ఖాతా ఖాళీ అవుతుంది. బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో జనాల్ని ముంచేస్తున్నారు. డిజిటల్ అరెస్టు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ అధికారులు, సీబీఐ అధికారులు, ముంబై పోలీసులు పేరుతో అమాయకులను బెదిరించి, అందినకాడికి గుంజుకుంటున్నారు.పరిమితికి మించి నగదు బ్యాంకు ఖాతాలో ఉన్నందున ఆడిట్ చేయాలంటూ ఆర్‌బీఐ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించి డబ్బులు కొల్లగొడుతున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, రుణం పేరిట మోసం
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ, ఆన్‌లైన్ బెట్టింగ్ అనే వ్యసనం ఈ రెండు తెలంగాణలో తాజాగా నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి.నిజామాబాద్‌కు చెందిన అనిల్, యాదాద్రికి చెందిన పవన్ కుమార్ మరణాలు కలచివేస్తున్నాయి.నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం నల్లవెల్లికి చెందిన అనిల్ (29) ఆన్ లైన్ రుణం కోసం సైబర్ నేరగాళ్లకు రూ.7 లక్షలు చెల్లించాడు. తాను సైబర్ మోసగాళ్ల బారిన పడ్డానని గుర్తించిన అనిల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని తంగడపల్లికి చెందిన బాలగోని పవన్ కుమార్ (27) ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడి అప్పులు చేసి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువత సైబర్ నేరగాళ్ల వలలో పడకండి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి అంటూ హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.
నకిలీ ట్రాఫిక్ చలాన్ పేరిట...
సైబర్ మోసగాళ్లు ట్రాఫిక్ చలాన్ ల పేరిట నయా మోసాలకు తెర లేపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల పేరిట నకిలీ ట్రాఫిక్ చలాన్ ల లింక్ పంపించి వాటిని ప్రజలు క్లిక్ చేయగానే వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు.హైదరాబాద్‌లోని చాలా మంది పౌరులు నకిలీ ట్రాఫిక్ చలాన్ మోసాల బారిన పడ్డారు.
మోసగాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నారు. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత, ఇవి అధికారిక ప్రభుత్వ పోర్టల్‌లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లకు దారి మళ్లించి, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే ఖాళీ చేస్తున్నారు.ఎస్ ఎం ఎస్ లింక్‌ల ద్వారా ఎప్పుడూ చలాన్ లు చెల్లించవద్దని, అధికారిక ఇ-చలాన్ వెబ్‌సైట్‌లో మాత్రమే చలాన్ లు చెల్లించాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కోరారు.
సైబర్ నేరాలపై సీ మిత్ర
సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు 'సీ-మిత్ర' చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టారు. రోజుకు సగటున 100 మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు రాగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కిపైగా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు.
ఇంటి నుంచే ఫిర్యాదు
సైబర్ నేర బాధితులు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే 'సీ-మిత్ర' బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తారు.
అప్రమత్తంగా ఉండండి : సైబర్ క్రైమ్స్ యూనిట్, హైదరాబాద్
ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. ఓటీపీ లేకపోయినా నకిలీ లింక్‌పై ఒకే క్లిక్ సరిపోతుంది. ఆ లింక్ ఎస్ఎంఎస్, వాట్సాప్, ఇమెయిల్, ఇన్ స్టాగ్రామ్ లేదా హ్యాక్ చేసిన స్నేహితుడి ఖాతా నుంచి కూడా రావచ్చు. ఇది బ్యాంక్ సందేశం, కొరియర్ అప్‌డేట్, కేవైసీ హెచ్చరిక లేదా బహుమతి హెచ్చరిక లాగా కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసిన క్షణంలో, దాచిన యాప్ లేదా స్క్రిప్ట్ మీ ఫోన్‌కు యాక్సెస్ పొందుతుంది. మీ స్క్రీన్‌ను చూడవచ్చు. మీ బ్యాంకింగ్ యాప్‌లను నియంత్రించవచ్చు. డబ్బును నిశ్శబ్దంగా బదిలీ చేయవచ్చు. పోలీసులు ఎప్పుడూ లింక్‌లను క్లిక్ చేయమని లేదా వివరాలను పంచుకోమని అడగరు. నిజమైన అధికారి ఎవరూ కాల్‌లో అరెస్టు చేస్తామని బెదిరించరు. మీరు పొరపాటున క్లిక్ చేస్తే, త్వరగా చర్య తీసుకోండి. ఇంటర్నెట్‌ను ఆపివేయండి. వెంటనే 1930కి కాల్ చేయండి. పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట జరిగే మోసాలపై జాగ్రత్త. ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మి మోసపోవద్దు. కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే వేలల్లో డబ్బులు వస్తాయనేది పక్కా మోసమే. పార్ట్‌టైమ్ జాబ్స్ అంటూ వచ్చే లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దు.
కొత్త ఏడాది కొత్త ఆశల కోసం… కానీ ఒక్క నిర్లక్ష్య క్లిక్ జీవితాన్నే ఖాళీ చేస్తోంది. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తతే అసలైన రక్షణ. అనుమానాస్పద లింక్ వస్తే క్లిక్ చేయొద్దు… మోసమైతే వెంటనే 1930కి కాల్ చేయండి. మీ జాగ్రత్తే మీ సంపాదనకు భద్రత.సైబర్ నేరాలు రోజురోజుకు రూపం మార్చుకుంటున్నాయి. చట్టం, పోలీసుల చర్యలు ఎంత కఠినంగా ఉన్నా… ప్రజల జాగ్రత్త లేకపోతే మోసాలు ఆగవు. లింక్‌లకు దూరంగా ఉండటం, సులభ లాభాల ఆశను దూరం పెట్టడమే సైబర్ మోసాలకు సరైన సమాధానం.
Next Story


