
సికింద్రాబాద్ ఆర్మీ ఆయుధాల చోరీపై ఎన్ఐఏ దర్యాప్తు
సికింద్రాబాద్ బొల్లారం ఆర్మీ ఆయుధాగారం నుంచి 12 ఆయుధాలు, 1,800కు పైగా రౌండ్లు మాయమైన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం ఆర్మీ ఆయుధాగారం నుంచి అత్యాధునిక ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి మాయమైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరింది. ఆయుధాలు ఒకేరోజు చోరీ కాలేదని.. గత కొన్ని రోజులుగా విడతల వారీగా మాయమైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆర్మీ రికార్డుల్లో భారీ వ్యత్యాసాలు కనిపించడంతో ఈ కోణం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. ఎన్ఐఏతో పాటు ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా దర్యాప్తును ముమ్మరం చేశాయి.
12 ఆయుధాలు.. 1,800కు పైగా రౌండ్లు మాయం
బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి మొత్తం 12 అత్యాధునిక ఆయుధాలు, 1,800కు పైగా రౌండ్ల మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించారు. వీటిలో 4 ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆటో పిస్టళ్లు ఉన్నాయి. రాత్రి సమయంలో చూడటానికి ఉపయోగించే నైట్ విజన్ బైనాక్యులర్ కూడా చోరీకి గురైన వాటిలో ఉంది. ఆయుధాల స్టాక్‌ను పరిశీలించిన సమయంలో భారీ తేడాలు కనిపించడంతో ఈ ఘటన బయటపడింది.
విడతల వారీగా చోరీ జరిగిందా?
దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం ఇదే. ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఒకేసారి మాయమయ్యాయా? లేక కొంతకొంతగా బయటకు తీసుకెళ్లారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ అంతర్గత రికార్డుల్లో కనిపించిన తేడాలు చోరీ విడతల వారీగా జరిగి ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూర్చాయి. దీంతో గత కొన్ని రోజుల కార్యకలాపాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
సీసీటీవీలు ఎందుకు ఆఫ్ చేశారు?
కట్టుదిట్టమైన భద్రత ఉండే కంటోన్మెంట్‌లోకి బయటి వ్యక్తులు ప్రవేశించడం అంత సులభం కాదు. దీంతో ఆర్మీ సిబ్బంది లేదా అక్కడ పనిచేసే సివిలియన్లలో ఎవరికైనా ఈ చోరీతో సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆయుధాగారం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు చోరీ జరిగినట్లు భావిస్తున్న సమయంలో ఆఫ్‌లో ఉండటం దర్యాప్తులో కీలకంగా మారింది. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా కెమెరాలను ఎందుకు నిలిపివేశారనే అంశంపై ఆర్మీ ఉన్నతాధికారులు ప్రత్యేక అంతర్గత విచారణ చేపట్టారు.
60 మందికి పైగా విచారణ
మద్రాస్ రెజిమెంట్ సరిహద్దు గోడ సమీపంలో ఒక ఆర్మీ మ్యాగజైన్ లభించడం కేసులో మరో కీలక ఆధారంగా మారింది. చోరీకి గురైన ఆయుధాలను గోడపై నుంచి బయటకు విసిరేశారా? లేక ఆయుధాలు ఇంకా ఆర్మీ క్యాంపస్‌లోనే ఎక్కడైనా దాచారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ కేసులో 60 మందికి పైగా అనుమానితులను అధికారులు విచారించారు. ప్రస్తుతం మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు, ఇటీవల బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన సిబ్బందిపైనా దృష్టి పెట్టారు. వారి కాల్ డేటా రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో ఎవరెవరితో సంప్రదింపులు జరిపారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కంటోన్మెంట్‌లో హై అలర్ట్
ఆయుధాల చోరీ వెలుగులోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. సాధారణ పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను గేట్ల వరకే అనుమతిస్తున్నారు. ప్రవేశం వద్ద కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎక్కడ ఉన్నాయనే అంశంపైనే దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఆయుధాలు బయటకు వెళ్లాయా, లేక క్యాంపస్‌లోనే దాచారా అనే కోణాల్లో గాలింపు కొనసాగుతోంది. ఎన్ఐఏతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆర్మీ అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

