
పాఠశాల విద్యార్థులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ (ఫొటో కర్టసీ :ఎక్స్ పోస్టు, నిర్మల్ జిల్లా కలెక్టర్)
నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకున్న నిర్మల్, గద్వాల్ జిల్లాలు
అభివృద్ధిలో తెలంగాణ జిల్లాల సత్తా: జాతీయ సెమినార్కు ఎంపిక
మారుమూల, వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపు పొందిన తెలంగాణలోని నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలు ఇప్పుడు అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద అమలు చేసిన ఉత్తమ పద్ధతులతో ఈ జిల్లాలు నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకొని, విశాఖపట్నంలో జరిగిన ప్రాంతీయ సెమినార్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి.సమిష్ఠి కృషితో సాధించిన ప్రగతితో తెలంగాణ జిల్లాలకు జాతీయ గుర్తింపు లభించింది.
తెలంగాణ మోడల్ ఆదర్శం
నీతి ఆయోగ్ సెమినార్ సోమవారం విశాఖపట్నంలో నిర్వహించింది.ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో పంచుకున్నారు.తెలంగాణలో వెనుకబడిన జిల్లాలైన నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు అక్షరాస్యతలోనే కాదు అభివృద్ధిలోనూ వెనుకబడి ఉన్నాయి. దేశంలోనే మారుమూల వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. సంపూర్ణ అభియాన్ లో భాగంగా నిర్మల్ జిల్లా పెంబి మండలం వందశాతం ప్రగతి సాధించింది. గర్భిణుల పరీక్షలు, పోషకాహారం పంపిణీ, మధుమేహ నియంత్రణ, రక్తపోటు నియంత్రణలో సత్ఫలితాలు సాధించింది. భూసార పరీక్షలు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో ప్రగతి సాధించింది. విద్య, ఆరోగ్యం, అమ్మ రక్షిత, బాలశక్తి, ఆగ్రో ఫారెస్ట్రీ, మహిళా శక్తి రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
పదోతరగతిలో వంద శాతం ఉత్తీర్ణత
పెంబి గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్లను తగ్గించేందుకు విద్యావాలంటీర్లను నియమించారు. పదోతరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. సౌత్ జోన్–3కు చెందిన ఆరు రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నిర్మల్ జిల్లాలోని పెంబి బ్లాక్ లో విద్య, ఆరోగ్యం, అమ్మ రక్షిత, బాలశక్తి, వ్యవసాయం, ప్రాథమిక వసతుల రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను ఈ సెమినార్లో ప్రదర్శించారు.నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ కార్యక్రమంలో పెంబి బ్లాక్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.విద్యా వాలంటీర్లను నియమించడం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం, మోడల్ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.విద్యార్థులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వల్ల చదువుపై ఆసక్తి పెరిగి పదవ తరగతి ఫలితాలు 100శాతం శాతం నమోదు అయ్యాయి.
ప్రత్యేక అధికారుల నియామకం
పెంబి బ్లాక్ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు సీనియర్ జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా పలు ఆవిష్కరణాత్మక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.బాలశక్తి, అగ్రో ఫారెస్ట్రీ, మహిళా శక్తి, అమ్మ రక్షిత వంటి కార్యక్రమాలు, అన్ని శాఖల సమన్వయంతో పెంబి బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్ కింద ఉత్తమ పద్ధతులలో ఒకటిగా నిలిచింది.ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందడం, భూసారపరీక్ష కార్డులు అందించడం, పోషకాహార లోపం తగ్గడం వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించింది.ఈ విజయానికి అన్ని శాఖల సమిష్టి కృషే కారణమని అధికారులు తెలిపారు. 2024 డిసెంబర్లో నితి ఆయోగ్ నిర్వహించిన ర్యాంకింగ్స్లో దేశంలోని 500 బ్లాకుల్లో పెంబి బ్లాక్ నాలుగో స్థానం సాధించి రూ.1 కోటి ప్రోత్సాహక నగదు అందుకుంది.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
తెలంగాణ నుంచి నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలు మాత్రమే ఈ ప్రతిష్ఠాత్మక సెమినార్కు ఎంపిక కావడం గర్వకారణమని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చెప్పారు. పెంబి బ్లాక్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు, సమాజ అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ వేదికపై ప్రదర్శించారు. సమిష్టి కృషి, సమన్వయంతో సాధించిన అభివృద్ధి వల్ల నిర్మల్ జిల్లా పెంబి బ్లాక్ జాతీయ వేదికపై నిలిచింది. ఈ విజయంతో తెలంగాణ జిల్లాలు అభివృద్ధి నమూనాగా దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి.
Next Story


