కల్తీ వ్యాపారులకు వార్నింగ్! 1500 మందితో ప్రత్యేక ఫోర్స్
x

కల్తీ వ్యాపారులకు వార్నింగ్! 1500 మందితో ప్రత్యేక ఫోర్స్


తెలంగాణలో మీరు తింటున్న ఆహారం నిజంగా సురక్షితమేనా? మెడికల్ షాపులో కొనుగోలు చేస్తున్న మందు అసలైనదేనా? ఇటీవల వరుసగా బయటపడుతున్న కల్తీ ఆహారం, నకిలీ ఔషధాల కేసులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 1,500 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ తో పాటు ఒక ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణలో గత కొద్ది నెలలుగా కల్తీ కేసులు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కల్తీ పనీర్, నెయ్యి, ఖోవా, రసాయనాలతో పండించిన పండ్లు, నాసిరకం మాంసం, కల్తీ టీ పొడి, మసాలా పొడులు, పరిశుభ్రత లేని బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు... ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఘటనలు ఒకటి తర్వాత ఒకటి బయటపడ్డాయి.

దీంతో ప్రభుత్వం ఇప్పటికే పనిచేస్తున్న H-FAST బృందాల ద్వారా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో 185 కల్తీ కేసులు నమోదుకాగా, 121.8 టన్నులకుపైగా కల్తీ లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 247 కేసులను ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించారు. ప్రజల నుంచి 90కిపైగా ఫిర్యాదులు అందాయి. ఇవన్నీ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA), ఫుడ్ సేఫ్టీ విభాగం (FSW), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలో సుమారు 1,500 మంది సిబ్బంది పనిచేయనున్నారు. పర్యవేక్షణ బాధ్యతలను ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి అప్పగించే అవకాశం ఉంది.

ప్రత్యేక పోలీస్ స్టేషన్, ఆధునిక ల్యాబ్‌లు, అదనపు ప్రాసిక్యూటర్లు, వేగవంతమైన దర్యాప్తు, నమూనాల పరిశీలన, కేసుల నమోదు నుంచి కోర్టులో తీర్పు వచ్చే వరకు మొత్తం ప్రక్రియను ఈ విభాగమే పర్యవేక్షించనుంది. ప్రస్తుతం నెలకు వెయ్యి నమూనాలు మాత్రమే పరీక్షించే సామర్థ్యాన్ని 4 వేల నమూనాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త టాస్క్‌ఫోర్స్ దృష్టి ప్రధానంగా ప్రజలు నిత్యం ఉపయోగించే ఆహార, ఔషధ రంగాలపైనే ఉండనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మసాలా తయారీ యూనిట్లు, వాటర్ ప్లాంట్లు, ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలు, పాలు-నెయ్యి-పనీర్ తయారీ కేంద్రాలు, మెడికల్ షాపులు, ఔషధ గిడ్డంగులపై నిరంతర తనిఖీలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే H-FAST దాడుల్లో 60 టన్నుల చికెన్ వ్యర్థాలు, 27 టన్నుల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 25.8 టన్నుల రసాయనాలతో పండించిన పండ్లు, 15 టన్నుల నాసిరకం మాంసం, 9.2 టన్నుల ఊరగాయలు స్వాధీనం కావడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తోంది.

కల్తీ ఆహారం తింటే కేవలం ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే కాదు... దీర్ఘకాలంలో క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అందుకే ఈసారి ప్రభుత్వం కేవలం దాడులతో సరిపెట్టకుండా... ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ఆధునిక ల్యాబ్‌లు, వేగవంతమైన విచారణ, ప్రత్యేక పోలీస్ స్టేషన్, కఠిన చట్టపరమైన చర్యలతో కల్తీ మాఫియాపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయి? కల్తీ మాఫియాకు నిజంగానే చెక్ పడుతుందా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Read More
Next Story