
మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు
తుమ్మిడిహెట్టి వద్దు..కాళేశ్వరానికే ప్రాణం పోయాలి
సీఎం రేవంత్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ,అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయాలని వినతి
తెలంగాణలో కొత్తగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేసి, దాని బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టి తిరిగి పనిచేసేలా చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విన్నవించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డికి మంగళవారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేయండి
రాష్ట్రంలో 90 శాతం నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టులను మాత్రమే కొనసాగించి, మిగతా వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచించింది. 2006వ సంవత్సరంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించగా, 2014 నాటికి 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మధ్యలోనే నిలిపివేసి, 2014లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 2023 నాటికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, నిర్మాణ లోపాల కారణంగా అది ప్రస్తుతం పనిచేయడం లేదు.
ఇప్పుడు కొత్తగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును చేపట్టడం అవసరం కానేకాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఎస్.ఎల్.బి.సి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని, కానీ 12 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయని యం పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా చేపట్టే భారీ సాగునీటి ప్రాజెక్టులకు కనీసం రెండు సంవత్సరాలపాటు విరామం ఇవ్వడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ సాగునీటి ప్రాజెక్టుల అనుభవాలు ఆశాజనకంగా లేవని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. భారీ పెట్టుబడులు, దీర్ఘకాల నిర్మాణ వ్యవధి, పర్యావరణ నష్టం, భూసేకరణ వల్ల సాధారణ ప్రజలకు కలిగే నష్టం, చివరకు అవినీతి వంటి అంశాలు ప్రతి భారీ సాగునీటి ప్రాజెక్టుతో ముడిపడి ఉంటున్నాయి.వరి, చెరకు వంటి పంటలకు నిరంతర నీటి అవసరం ఉండగా, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పత్తి వంటి పంటలు ఆరుతడి పంటలుగా సాగు చేస్తున్నారు. మరికొన్ని పంటలు పూర్తిగా వర్షాధారంగా ఉన్నాయి. కాలువల ద్వారా లేదా ఉచిత విద్యుత్ ఆధారిత భూగర్భ జలాల ద్వారా నీటి లభ్యత పెరగడంతో పంటల సాగు విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. వరి అధికోత్పత్తి కారణంగా కొనుగోలు సమస్యలు ఏర్పడుతున్నాయి.అందువల్ల ప్రభుత్వం వ్యవసాయ శాఖ జోక్యం చేసుకొని రైతులు వరి సాగును తగ్గించి, నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఉద్యానవన పంటల సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని యం.పద్మనాభ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story

