
హరిద్రానదిలో పాతరాతియుగం పరికరాలు
మధ్యపాతరాతియుగం పనిముట్లను గుర్తించిన కొత్త తెలంగాణచరిత్రబృందం
తెలంగాణ మెదక్ జిల్లా కేంద్రం పక్కన ప్రవహించే హరిద్రానది మంజీరా నదికి ఉపనది. మంజీర, హరిద్రలు కందకుర్తివద్ద గోదావరితో కలిసి పెద్దగోదావరి ఏర్పడుతుంది. హరిద్రానది గర్భంలో అన్వేషిస్తున్న కొత్త తెలంగాణచరిత్రబృందం పరిశోధకసభ్యులు మచ్చ ప్రణయ్ కుమార్, బుర్ర సంతోష్ లు రాతియుగాల పనిముట్లను గుర్తించి, సేకరించారు. వీటిలో పాతరాతియుగం నుంచి కొత్తరాతియుగందాక ఎన్నో రాతిపనిముట్లున్నాయి.
ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారు నిర్వహించిన వర్క్ షాప్ లో వక్తగా విచ్చేసిన డా.రవి కొరిసెట్టర్ గారు చరిత్రబృందం సేకరించిన ఛెర్ట్ రాతిపనిముట్లను పరిశీలించి వాటిలో మధ్యరాతిపాతరాతియుగం పనిముట్లు దొరకడాన్ని అభినందించారు. ప్రస్తుతం దేశంలో వివిధప్రాంతాల నుంచి గుర్తించబడి, సేకరిస్తున్న రాతిపనిముట్లు ఇక్కడ మానవవికాసం ఎన్ని లక్షలేండ్ల కిందటి నుంచి వున్నదో ధృవపరుస్తున్నాయన్నారు.
హరిద్రానదిలో కొంతకాలం కింద ఎగువపాతరాతియుగం పనిముట్లు, ఆంత్రోపోమార్ఫిక్ శిలలను గుర్తించి సేకరించాడు మచ్చ ప్రణయకుమార్. మెదక్ కేంద్రంగా చరిత్రను అన్వేషిస్తున్న ప్రణయ్ కుమార్, సంతోష్ లిద్దరు చరిత్రపూర్వయుగం రాతిచిత్రాల తావులను, ఆలయశిల్పాలను, ఇపుడీ రాతిపనిముట్లను గుర్తించి తెలంగాణ చరిత్రకు కొత్త పుటలు చేరుస్తున్నారని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.
మధ్య పాతరాతియుగం: (Middle Paleolithic Age) ప్రాచీన శిలాయుగంలో రెండవ దశ, ఇది సుమారు 3 లక్షల నుండి 30,000 సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. ఈ కాలంలో మానవులు క్వార్ట్‌జైట్, ఛెర్ట్, చెకుముకి రాళ్లతో చేసిన 'ఫ్లేక్ టూల్స్' (పెచ్చు రాతి పనిముట్లు) ఉపయోగించారు.

