
దసరా నుంచే తులం బంగారం? కళ్యాణలక్ష్మికి బదులుగా గోల్డ్!
ఏటా 2 టన్నుల బంగారం కావాల్సిందేనా?
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) దసరా నుంచే తులం బంగారం? కళ్యాణలక్ష్మికి బదులుగా గోల్డ్!
2) 7 ఫ్లైఓవర్లు క్యాన్సిల్? ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్!
3) ఇకపై చెత్త సేకరణకు 4 డబ్బాలు.. ఏ రంగు డబ్బాలో ఏ చెత్త?
1) దసరా నుంచే తులం బంగారం?కళ్యాణలక్ష్మికి బదులుగా గోల్డ్!
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దసరా నుంచే తులం బంగారం పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తరహాలో ఇప్పటి వరకు అందుతున్న నగదు సాయానికి బదులుగా పుస్తెలు రూపంలో తులం బంగారం అందించే ప్రతిపాదనపై ప్రభుత్వం అంచనాలు, మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విడుదల చేసిన ‘అభయ హస్తం’ మేనిఫెస్టోలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ‘ఇందిరమ్మ కానుక’గా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే, తులం బంగారం అనేది ఇప్పుడు కొత్తగా తెస్తున్న పథకం కాదు. 2023 ఎన్నికల హామీల్లోనే ఉన్న పెండింగ్ అంశం.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించింది.
మొదటిది మహాలక్ష్మి. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
రెండోది రైతు భరోసా. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, వరికి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్.
మూడోది గృహజ్యోతి .200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు.
ఐదోది యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్.
ఆరోది చేయూత. వృద్ధులు, వితంతువులు తదితరులకు నెలకు 4 వేల రూపాయల పెన్షన్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల ఆరోగ్య కవరేజ్.
ఆరు గ్యారెంటీలతో పాటు...కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ వంటి వర్గాల వారీ డిక్లరేషన్లు కూడా ప్రకటించింది.
ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి ‘అభయ హస్తం’ మేనిఫెస్టోలో మరిన్ని హామీలు చేర్చింది. 42 పేజీల మేనిఫెస్టోలో ఉద్యోగాలు, రైతులు, మహిళలు, విద్య, వైద్యం, హైదరాబాద్ అభివృద్ధి, ఉద్యోగుల సమస్యలు వంటి అనేక అంశాలపై హామీలు ఇచ్చింది. బీఆర్ఎస్ మాత్రం మొత్తం హామీలను సుమారు 420గా పేర్కొంటూ, వాటి అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.
ఎందుకంటే ఇది కేవలం మరో సంక్షేమ పథకం కాదు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఇప్పటికే పెళ్లికి ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పుడు అదే తరహాలో, నగదు స్థానంలో బంగారం ఇస్తే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత? ఏటా ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? అర్హతలు ఎలా నిర్ణయిస్తారు? బంగారం నేరుగా ఇస్తారా? పుస్తెలు, మట్టెల రూపంలో ఇస్తారా? ఇప్పటికే ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా మార్చేస్తారా? లేక రెండింటినీ కొనసాగిస్తారా? ఇవన్నీ ఇప్పుడు కీలక ప్రశ్నలుగా మారాయి.
మరోవైపు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు, చెల్లింపులపై కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది. అక్టోబర్ 2న హరీశ్‌రావు దాదాపు రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తూ, పాత పథకాలను కొనసాగించడంతో పాటు తులం బంగారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మికి ప్రత్యామ్నాయంగా తులం బంగారం. మరి ఇది ఎన్నికల హామీ అమలులో మరో ముందడుగా? లేక ఇప్పటికే ఉన్న పథకానికి రూపం మార్చడమేనా? ముఖ్యంగా, 420కి పైగా హామీలు, ఆరు గ్యారెంటీలు, పలు డిక్లరేషన్ల మధ్య... తులం బంగారం హామీకి ఇప్పుడు ఎందుకు ముహూర్తం కుదిరింది? పెండింగ్ హామీ తులం బంగారం పథకం అమలుకు ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దసరా నుంచే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్హతలు, మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది.
ఎన్నికల హామీగా ఇచ్చిన తులం బంగారం పథకాన్ని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల స్థానంలో అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్దిదారులకు ₹1,00,116 నగదు ఇస్తున్నారు. నగదు సాయం స్థానంలో నిరుపేద ఆడబిడ్డలకు పెళ్లి సమయంలో బంగారు పుస్తెలు, అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. దసరా నుంచి పథకాన్ని ప్రారంభించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పథకం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, పథకం పరిధి కీలకంగా మారనున్నాయి. ఎన్నికల హామీల అమలుపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో తులం బంగారం పథకం నిర్ణయం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
2025-26కు తెలంగాణ ePASS డేటాలో కల్యాణలక్ష్మి 1,19,788 + షాదీ ముబారక్ 30,502 = 1,50,290 మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. ప్రస్తుతం ఏడాదికి సుమారు 1.5 లక్షల మంది వరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో.. వారికి తులం బంగారం ఇవ్వాలంటే ప్రభుత్వం ఏటా సుమారు 1.75 టన్నుల బంగారం సమకూర్చాల్సి ఉంటుంది. బడ్జెట్ భారం ₹2,623 కోట్లు వరకు ఉండవచ్చు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం స్థానంలోనే పేరు మార్చి తులం బంగారం పథకం వస్తుందా? లేక పాత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకంగా వస్తుందా?
2) 7 ఫ్లైఓవర్లు క్యాన్సిల్?ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్!
హైదరాబాద్‌లో KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్ అంటే వాహనదారులకు పెద్ద టెన్షన్. దీన్ని తగ్గించేందుకు గతంలో 7 ఫ్లైఓవర్లు.. 7 అండర్‌పాస్‌లతో భారీ ప్రాజెక్ట్ ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారిపోయింది! 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్. ఒక అండర్‌పాస్‌తో కొత్త డిజైన్‌కు GHMC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పాత ప్లాన్ లో KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసేందుకు గతంలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఈ డిజైన్‌పై మరోసారి సమీక్ష చేసిన అధికారులు.. మరింత సింపుల్‌గా, తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసేలా రీ-అలైన్మెంట్ చేశారు. కొత్త ప్లాన్‌లో ఒక భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్. ఒక అండర్‌పాస్ మాత్రమే. అంటే పలు చోట్ల చిన్న చిన్న ఫ్లైఓవర్లకు బదులుగా, ప్రధాన ట్రాఫిక్‌ను ఒకే ఎలివేటెడ్ కారిడార్‌పైకి తీసుకెళ్లేలా డిజైన్ మార్చారు. ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ సుమారు 4.4 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని MJ ఇంజనీరింగ్ కాలేజ్, నాగార్జున సర్కిల్ పరిసరాల నుంచి.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు. మొత్తం 6 లేన్లుగా దీనిని అభివృద్ధి చేయనున్నారు.
ఇక మరో కీలకమైన కనెక్షన్..బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 నుంచి రోడ్ నంబర్ 12కు అండర్‌పాస్! దీంతో KBR చుట్టూ కీలకమైన ట్రాఫిక్ మూవ్‌మెంట్స్‌ను ఫ్లైఓవర్, అండర్‌పాస్ ద్వారా విభజించేలా కొత్త డిజైన్ ఉండనుంది.
ఇక ఈ ప్రాజెక్టులో మరో కీలక మార్పు KBR పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్. ప్రస్తుతం ట్రాఫిక్ నిర్వహణ కోసం అమలు చేస్తున్న వన్‌వే విధానానికి వాహనదారుల నుంచి మంచి స్పందన రావడంతో, దీన్ని శాశ్వతంగా కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు GHMC అధికారులు తెలిపారు.
వన్‌వే రూట్లో ఉన్న డివైడర్ల పరిమాణాన్ని కూడా తగ్గించి.. రోడ్డును మరింత విస్తరించనున్నారు. అంటే, వన్‌వే + 6 లేన్ల రోడ్డు + ఎలివేటెడ్ కారిడార్ + అండర్‌పాస్. ఈ నాలుగు అంశాలే కొత్త KBR ట్రాఫిక్ ప్లాన్‌లో కీలకం.గతంలో ప్రతిపాదించిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో పోలిస్తే, కొత్త రీ-అలైన్మెంట్ వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గనుంది. GHMC అధికారుల ప్రకారం.. సుమారు రూ.400 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
3. ఇకపై చెత్త సేకరణకు 4 డబ్బాలు.. ఏ రంగు డబ్బాలో ఏ చెత్త?
ఇప్పటి వరకు ఇంట్లో చెత్త అంటే, తడి చెత్త, పొడి చెత్త అంటూ రెండు రకాలుగా వేరు చేసేవాళ్లం. కానీ ఇకపై హైదరాబాద్‌లో చెత్త సేకరణ విధానం పూర్తిగా మారబోతోంది. ఇక ప్రతి ఇంట్లో రెండు కాదు. ఏకంగా నాలుగు డబ్బాలు ఉండాలి! తడి చెత్త ఒక డబ్బాలో, పొడి చెత్త మరో డబ్బాలో, శానిటరీ, బయోమెడికల్ వ్యర్థాలు ఇంకో డబ్బాలో, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మరో డబ్బాలో. అసలు ఈ నాలుగు డబ్బాలు ఎందుకు? అనే కదా మీ డౌట్.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి సేకరించే విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రజలు చెత్తను వేరు చేసి ఇస్తున్నా, సిబ్బంది మాత్రం వాటన్నింటినీ ఒకే ట్రాలీలో తీసుకెళ్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ నాలుగు రంగుల డబ్బాలు పంపిణీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏ రంగు డబ్బాలో ఏ చెత్త వేయాలి?
మొదటిది.. ఆకుపచ్చ డబ్బా. కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం వంటి తడి చెత్తను మాత్రమే ఆకుపచ్చ డబ్బాలో వేయాలి.
రెండోది.. నీలం డబ్బా. ప్లాస్టిక్, కాగితాలు వంటి పొడి చెత్త ఇందులో వేయాలి.
మూడోది.. ఎరుపు డబ్బా. డైపర్లు, శానిటరీ ప్యాడ్లు, బయోమెడికల్ వ్యర్థాలను ఇందులో వేయాలి.
నాలుగోది.. నలుపు డబ్బా. బ్యాటరీలు, బల్బులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ప్రమాదకర వ్యర్థాలను ఈ డబ్బాలో వేయాలి. అంటే, ఇకపై ఇంట్లో చెత్తను పడేసేటప్పుడు కూడా ఏది ఏ కేటగిరీకి చెందుతుందో చూసుకోవాల్సిందే!మరి ఇంత కచ్చితంగా చెత్తను వేరు చేయడం ఎందుకు అంటే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో రోజూ సుమారు 10 వేల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో చెత్తను ఉత్పత్తి అయ్యే సమయంలోనే వేరు చేస్తే.. రీసైక్లింగ్ ప్రక్రియ మరింత సులభం అవుతుంది. అధికారుల అంచనా ప్రకారం, ఇలా వేరు చేసిన చెత్తలో సుమారు 7 వేల టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది.
అందుకే ఇంటి నుంచే చెత్త విభజనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.చెత్త ఆటోలు కూడా మారనున్నాయ్. స్వచ్ఛ ఆటోల్లో కూడా నాలుగు రకాల చెత్తను విడివిడిగా సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఒకే ట్రాలీలో మొత్తం చెత్తను కలపకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ కొత్త విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ నాలుగు రంగుల డబ్బాలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అంటే, ఇక నుంచి చెత్త సేకరణలో మార్పు కేవలం మున్సిపల్ సిబ్బందిలోనే కాదు. ప్రతి ఇంటి నుంచే మొదలుకానుంది.

