
ఉల్లి ధర తగ్గి రైతుల కంట కన్నీరు
తెలంగాణలో తగ్గిన ఉల్లి ధరలు...రైతులకంట కన్నీళ్లు
అకాల వర్షాలు, ఎగుమతుల సంక్షోభం, హోటళ్ల మూత, డిమాండ్ తగ్గుదల...
తెలంగాణలో కష్టపడి పండించిన ఉల్లి పంటకు కనీస ధర రాకపోవడంతో ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.తెలంగాణలోని వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి రైతులు హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మార్కెట్‌కు ఉల్లిని తీసుకువస్తే శనివారం క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1100 వరకు మాత్రమే ధర పలికింది.మలక్ పేట మార్కెట్ లో మధ్యస్థంగా క్వింటాల్ ఉల్లి ధర రూ.900 పోయింది. కనీసం పొలాల నుంచి మార్కెట్ కు ఉల్లి రవాణ చేయాలంటే రవాణా చార్జీలు అధికం అవుతున్నాయని రైతులు లబోదిబో అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక తెలంగాణ జిల్లాలోని ఉల్లి రైతులు సమీపంలోని సంతల్లో తక్కువ ధరలకు కిలో నాలుగైదు రూపాయలకు విక్రయిస్తున్నారు.
గత వారం అయితే క్వింటాల్ ఉల్లి ధర రూ.300 రూపాయలకు పడిపోయింది. గత రెండు రోజులుగా ధరలు రూ.800 లకు పెరిగాయి. ధరలు పడిపోయి ఉల్లి రైతులు అవస్థలు పడుతున్నారు.
చిన్న ఉల్లిగడ్డల ధర మరీ తక్కువ
చిన్న ఉల్లిగడ్డల ధర క్వింటాల్ రూ.200లే పలికింది. చిన్న ఉల్లిలో మేలురకమైన ధర క్వింటాల్ కు 700 రూపాయలు , మోడల్ ధర రూ.500 లుగా మార్కెట్ లో విక్రయిస్తున్నారు. సన్న రకం ఉల్లికి ధరలు మరింత పతనం కావడంతో కనీసం రవాణ చార్జీలు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు చెందుతున్నారు. చిన్న రకం ఉల్లి గడ్డల ధర నాణ్యత లేదనే పేరుతో మరింత తగ్గింది.
వర్షాలతో కుళ్లిపోయిన ఉల్లి
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు, అకాల వర్షాల వల్ల తడిసిన ఉల్లి కుళ్లిపోయింది. మరో వైపు మార్కెట్ తరలించే లోపే తడిసిన ఉల్లి దెబ్బతినడంతో దీనికి రేటు పడిపోయిందని ఉల్లి రైతు డి వేణుమాధవరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు ఆవేదనగా చెప్పారు. తడిసిన ఉల్లిని మార్కెట్ లో తక్కువ ధర పలుకుతుందని రైతులు చెప్పారు.
రైతులకు భారంగా రవాణ చార్జీలు
పండించిన ఉల్లిని మలక్ పేట హోల్ సేల్ మార్కెట్ తరలించి విక్రయించాలంటే రవాణ చార్జీలు రైతుకు భారంగా మారాయి. క్వింటాల్ ఉల్లిని మార్కెట్ కు తీసుకువచ్చేందుకు రూ. 100 రవాణ ఖర్చులు అవుతున్నాయి. అదే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి రైతులు మార్కెట్ కు సరుకు తీసుకురావాలంటే క్వింటాలుకు రూ.150 ఖర్చు అవుతుంది. దీని వల్ల కొందరు రైతులు తక్కువ ధరలకు ఉల్లిని సమీపంలోని సంతల్లో విక్రయించుకుంటున్నారు.
ఎగుమతులకు బ్రేక్
సాధారణంగా ఉల్లిని పొరుగుదేశమైన బంగాదేశ్ కు ఎగుమతి చేసే వారు. గత ఏడాది బంగ్లాదేశ్ తో మన దేశానికి ఏర్పడిన వివాదం, అక్కడి అల్లర్లతో ఉల్లి ఎగుమతులకు బ్రేక్ పడింది. దీనికి తోడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాలకు భారత దేశం నుంచి ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లి ఎగుమతులు నిలిచిపోవడంతో దేశంలో ఉల్లికి డిమాండ్ తగ్గిందని ఉల్లి హోల్ సేల్ వ్యాపారి కె దయానంద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
హోటళ్లు, హాస్టళ్లు మూతపడి...
అసలే ఉల్లి ఎగుమతులు నిలిచిపోతే, మరో వైపు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ’ ఉల్లి డిమాండ్ తగ్గిందని మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ చిలకా నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, హాస్టళ్లు మూతపడటంతో ఉల్లికి డిమాండ్ తగ్గిందని మలక్ పేట ఉల్లి మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ చిలకా నర్సింహారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరగడంతో రాష్ట్రంలోని పలు హోటళ్లు మూతపడ్డాయని, దీంతోపాటు విద్యాసంవత్సరం ముగియడంతో వేసవిసెలవుల వల్ల హాస్టళ్లు మూతపడ్డాయని సెక్రటరీ పేర్కొన్నారు. ప్రతీ రోజూ మలక్ పేట మార్కెట్ లో 40వేల క్వింటాళ్ల ఉల్లిని విక్రయించేవారని, కానీ హోటళ్లు, హాస్టళ్లు మూతపడటంతో 15వేల క్వింటాళ్లకు మించి ఉల్లిని విక్రయించలేక పోతున్నామని నర్సింహారెడ్డి చెప్పారు. మార్కెట్ కు సరుకు ఎక్కువ వస్తే రెండో రోజు విక్రయానికి పెట్టాల్సి వస్తుందని ఆయన వివరించారు.
మలక్ పేట మార్కెట్ కు ఉల్లి రాక ఎంతంటే...
మలక్ పేట హోల్ సేల్ ఉల్లి మార్కెట్ కు శనివారం 96 లారీల్లో 28,970 బ్యాగుల ఉల్లి వచ్చిందని, దీన్ని తూకం వేయగా 13,037 క్వింటాళ్లు తేలిందని మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ చిలకా నర్సింహారెడ్డి శనివారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
శనివారం మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి 30 లారీల్లో 9వేల బ్యాగుల ఉల్లి వచ్చిందని సెక్రటరీ చెప్పారు. మరో వైపు మహారాష్ట్ర నుంచి 11,570 బ్యాగులు, కర్ణాటక నుంచి 8,400 బ్యాగుల ఉల్లి వచ్చిందని తెలిపారు.
పెట్టుబడి నష్టంతో రైతుల దిగాలు
తెలంగాణలోని వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు.ఉల్లికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గడంతో పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మర్పల్లి, బంట్వారం, కోటపల్లి మండలాల్లోని రైతులు ఉల్లిని స్థానిక సంతల్లో కిలో రూ.4 నుండి రూ.6 చొప్పున అమ్ముకుంటున్నారు.ఉల్లి ఎకరా పండించడానికి రూ.60,000 ఖర్చవుతుండగా, దిగుబడి ధర రాక రైతులు నష్టపోతున్నారు. దీనికితోడు అకాల వర్షాల వల్ల పంట నాణ్యత దెబ్బతిని, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో దళారులు సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
డిమాండ్ తగ్గి రైతుల ఆందోళన
తెలంగాణలో కొత్త ఉల్లి పంట మార్కెట్లోకి రావడంతో ఏప్రిల్ నెల నాటికి ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.800 - రూ.900 లోపు ధర పలుకుతుండగా, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు కిలో లభిస్తోంది. సదాశివపేట, మలక్‌పేట్, బోయినపల్లి మార్కెట్లలో అధిక దిగుబడి కారణంగా ధరలు సగానికి పడిపోయాయి.
గత నెలలో కిలో రూ.40 నుంచి 50 వరకు ఉన్న రిటైల్ ఉల్లి ధర, ఇప్పుడు రూ.15-20కి పడిపోయింది. మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉల్లి సరఫరా పెరగడంతో క్వింటాల్ ధరలు తగ్గాయి.
వినియోగదారులకు ఊరట...
ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు ఇప్పుడు తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. మార్కెట్లలో సరఫరా పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు అధికమవడం వంటి కారణాలతో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నప్పటికీ, రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉల్లి ధరలు తగ్గడం గృహిణులకు, హోటల్ వ్యాపారులకు ఉపశమనాన్ని కలిగిస్తోంది.
ధరలు ఎందుకు తగ్గాయి?
గత నెల వరకు కిలో ఉల్లి ధరలు రూ.40–60 వరకు ఉండగా, ప్రస్తుతం చాలా మార్కెట్లలో రూ.20–30 మధ్యకు పడిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి రాక పెరగడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అలాగే కొత్త పంట మార్కెట్లోకి రావడం కూడా ధరల తగ్గుదలకు దోహదపడింది.
మార్కెట్లలో పరిస్థితి
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో ఉల్లి సరఫరా పెరిగింది. రైతు బజార్లు, హోల్‌సేల్ మార్కెట్లలో రోజువారీ ఉల్లి రాక పెరగడంతో వ్యాపారులు కూడా తక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు మరింత తగ్గుదల ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
రైతుల ఆందోళన
మరోవైపు రైతులు మాత్రం ధరలు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు ఖర్చులు పెరిగిన పరిస్థితిలో, సరైన ధరలు రాకపోవడం వల్ల నష్టాలు వాటిల్లే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరగతి రైతులు ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు.మొత్తంగా చూస్తే, తెలంగాణలో ఉల్లి ధరలు తగ్గడం వినియోగదారులకు శుభవార్త కాగా, రైతులకు మాత్రం సవాలుగా మారింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, మార్కెట్ పరిస్థితులపై వచ్చే మార్పులు తదుపరి పరిస్థితిని నిర్ణయించనున్నాయి.
Next Story

