
10 కులాలే తెలంగాణను ఏలుతున్నాయా ? ఇంట్రెస్టింగ్ రిపోర్ట్
50 వేల జనాభా ఉన్న 186 కులాలు బహుశా ఓట్లు వేయటానికి తప్ప సర్పంచ్ నుండి పార్లమెంటు వరకు ఏనాడు పదవులు అందుకున్నది లేదేమో అనిపిస్తున్నది
తెలంగాణలో 242 కులాలుండగా మొదటినుండి కేవలం 10 కులాలు మాత్రమే రాష్ట్రాన్ని రాజకీయంగా ఏలుతున్నట్లు తేలింది. ఇక్కడ ఏలటం అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మాత్రమే కాదు. రాజకీయంగా అత్యంత ప్రభావ వంతంగా ఉండటం కూడా ఏలటం కిందకే వస్తుంది. రాజకీయంగా ప్రభావ వంతంగా ఉండటం అంటే పదవులు ఏ రూపంలో అయినా కానీయంగా పది కులాల్లోని నేతలే అత్యధికం దక్కించుకుంటున్నారు. ఈ విషయం స్వతంత్ర నిపుణుల కమిటి రిపోర్టు ద్వారా వెలుగుచూసింది. రాష్ట్రంలో మొత్తం 242 కులాలుంటే పదికులాలు మాత్రమే ముఖ్యంగా మాదిగ, ముస్లిం, ముదిరాజ్, లంబాడీ, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నూరుకాపు, పద్మశాలీలు మాత్రమే పదవులను అందుకోవటంలో ముందున్నాయి.
10 లక్షలకు మించి జనాభా ఉన్న కులాలు 10 ఉండగా, 5-10 లక్షల మధ్య జనాభా ఉన్న కులాలు 6, లక్ష నుండి 5 లక్షల జనాభా ఉన్నకులాలు 24, 50 వేల నుండి లక్ష జనాభా ఉన్న కులాలు 16, 50 వేల లోపు జనాభా ఉన్న కులాలు 186 ఉన్నట్లు రిపోర్టులో బయటపడింది. సుమారు 3.55 కోట్లమంది ప్రజల అభిప్రాయాలను, జీవనాన్ని విశ్లేషించిన స్వతంత్ర నిపుణుల బృందం నివేదికను ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో వెనుకబాటుతనం అన్నది జనాభా ఆధారంగా కాకుండా వారి జీవన విధానంపై ఆధారపడి ఉందని నిపుణుల కమిటి తేల్చింది. రాష్ట్రం మొత్తం జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా 84.2 శాతం ఉంది. వీరిలో కూడా బీసీల జనాభానే 56.4 శాతంతో అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. ఎస్సీలు 17.4 శాతం, ఎస్టీలు 10.4, ఓసీలు 11.9 శాతం ఉన్నట్లు రిపోర్టు చెప్పింది.
జనాభాపరంగా మాదిగలు 10.3శాతం, ముస్లిం 7.9శాతం, ముదిరాజ్ 7.4శాతం, లంబాడి 6.8శాతంతో అగ్రస్ధానంలో ఉన్నారు. కాంపోజిట్ బ్యాక్ వర్డ్ నెస్ ఇండెక్స్ పేరిట 42 అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించినట్లు రిపోర్టు పేర్కొంది. ఓసీల వెనుకబాటుతనం 31 పాయింట్లు ఉంటే, ఎస్సీలది 96, ఎస్టీలది 95 పాయింట్లు ఉన్నట్లు తేలింది. అలాగే బీసీల వెనుకబాటుతనం 86 పాయింట్లుంటే రాష్ట్ర సగటు 81 పాయింట్లుగా తేలింది. వెనుకబాటు తనాన్ని నిర్ణయించటంలో విద్య కీలకమైన అంశంగా రిపోర్టు వివరించింది. ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో ఉన్న కులాలు సామాజికంగా మెరుగైన స్ధితిలో ఉన్నట్లు తేలింది. పేదిరకంలో ఉన్నప్పటికీ ఓసీ వర్గాలకు చెందిన 34శాతం మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ళకు వెళుతుండగా, ఎస్సీ, ఎస్టీల్లో ఈ సంఖ్య 5శాతం మాత్రమే అని రిపోర్టు బయటపెట్టింది.
ఎస్సీ, ఎస్టీల్లో 45శాతం మంది దినసరి కూలీలుగా జీవనం సాగిస్తుండగా, ఓసీల్లో 9శాతం మాత్రమే దినసరి కూలీలున్నట్లు తేలింది. ప్రైవేటురంగంలోని ఉద్యోగాల్లో ఓసీల వాటా 30శాతంగా తేలింది. ఎస్టీల వాటా 4శాతం, ఎస్సీల వాటా 14శాతం ఉన్నట్లు రిపోర్టు చెప్పింది. 1.1 కోట్లమంది వార్షిక ఆదాయం రు. 2 లక్షల లోపు మాత్రమే. ఇందులో 58శాతం మంది బీసీలే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో 33శాతం మందికి ఇప్పటికీ మరుగుదొడ్ల వసతిలేదని, ఓసీల ఇళ్ళల్లో 36శాతం మందికి రెఫ్రిజిరేటర్లు ఉండగా, ఎస్సీల్లో రెఫ్రిజిరేటర్లున్న వారిశాతం 14 మాత్రమే.
పై నివేదికను బట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే రాజకీయంగా ఓసీల్లో రెడ్లు, బీసీల్లో యాదవులు, గౌడ్లు, ముదిరాజులు, పద్మశాలీలు, కాపులు, ముస్లింలు, ఎస్సీలో మాదిగ ఎస్టీల్లో లంబాడిలు మాత్రమే రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు బయటపడింది. రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న కులాలు లేదా కులాల్లోని నేతల కుటుంబాలే అన్నీ విధాలుగా అంటే ఆర్ధిక, సామాజికరంగాల్లో కూడా ముందంజలో ఉంటాయి అనటంలో సందేహంలేదు. 50 వేల జనాభా ఉన్న 186 కులాలు బహుశా ఓట్లు వేయటానికి తప్ప సర్పంచ్ నుండి పార్లమెంటు వరకు ఏనాడు పదవులు అందుకున్నది లేదేమో అనిపిస్తున్నది. ఈ రిపోర్టును నిపుణుల బృందంలోని కంచె ఐలయ్య, ప్రవీణ్ చక్రవర్తి, భాగ్యభూక్యా, దీప్తి, ఐఏఎస్ అధికారి గౌరవ్ ఉప్పల్ ప్రభుత్వానికి అందించారు.

