
హైదరాబాద్‌లో మళ్లీ తెరచుకున్న ఓపెన్ థియేటర్… దీని చరిత్ర తెలుసా?”
ఐదు రోజుల పాటు అవార్డు సినిమాలు ప్రదర్శనలు. ప్రజలకు ఆకాశం కింద సినిమా అనుభవం అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఓపెన్ థియేటర్ సందడి మళ్ళీ మొదలయింది. లలిత కళా తొరణంలో ఓపెన్ ఎయిర్ ఫిల్మ్ స్క్రీనింగ్స్ తిరిగి షురూ అయ్యాయి. టూరిజం అండ్ కల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవార్డు విన్నింగ్ సినిమాలను ఎంపిక చేసి ప్రదర్శిస్తోంది. పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై రాత్రివేళల్లో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఓపెన్ ఎయిర్‌లో కూర్చొని సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఈ ఐదు రోజుల ప్రదర్శనలు ఏప్రిల్ 14న “డాక్టర్. బీఆర్ అంబేద్కర్,” సినిమాతో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15న “కోర్ట్”, 16న “తండేల్”, 17న “బలగం”, 18న “జనతా గ్యారేజ్” సినిమాలు ప్రదర్శించనున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమం కుటుంబాలు, సినిమా అభిమానులను ఆకర్షించేలా ఉంటుందని భావిస్తున్నారు. నగర మధ్యలో ఒకే వేదికపై అందరూ కలిసి సినిమా చూసే అనుభవాన్ని ఇది అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ వేదికకు గొప్ప చరిత్ర ఉంది. 1986లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించబడింది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనతో ఇది రూపుదిద్దుకుంది. కేవలం 84 రోజుల్లో నిర్మాణం పూర్తయ్యింది. అదే ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఈ వేదికను సిద్ధం చేశారు. ప్రజలకు సినిమాలు, నాటకాలు, సంగీత కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైంది.
సుమారు 5 వేల మంది కూర్చునే సామర్థ్యంతో, ఆకాశం కింద కార్యక్రమాలు నిర్వహించేలా దీనిని డిజైన్ చేశారు. ఒకప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్, నంది అవార్డ్స్, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక కేంద్రంగా నిలిచింది. 1986 నుంచి 2000ల వరకు ఈ వేదిక చాలా యాక్టివ్‌గా ఉండేది. కానీ ఆ తర్వాత నిర్వహణ లోపాలు, మౌలిక వసతుల సమస్యలు, ఇండోర్ ఆడిటోరియంల ప్రాధాన్యం పెరగడం వల్ల కార్యక్రమాలు తగ్గిపోయాయి. 2010 తర్వాత దాదాపు నిశ్శబ్దంగా మారింది.
పేరు మార్పు నిర్ణయం కూడా చర్చకు దారి తీసింది. అయినప్పటికీ ప్రజల్లో పాత పేరే కొనసాగింది. పూర్తిగా మూసివేయకపోయినా, కార్యక్రమాలు అప్పుడప్పుడు మాత్రమే జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఈ వేదికను యాక్టివ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ స్పేస్‌లను ప్రజలకు దగ్గర చేయడం, కళలకు ఓపెన్ వేదిక ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రదర్శనలు అందరికీ ఉచితం. కుటుంబాలు, యువత కలిసి ఆకాశం కింద సినిమా అనుభవాన్ని ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు.

