
పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై ఆందోళన.. యశోదా ఆసుపత్రిలో చికిత్స
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించి ఆయన ప్రాణాలను కాపాడారు.
రోహిణి ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత రెడ్డి మాట్లాడుతూ... కార్డియాక్ అరెస్ట్‌కు గురైన సుదర్శన్‌రెడ్డికి దాదాపు గంటపాటు సీపీఆర్ చేసిన తర్వాత స్పందన వచ్చిందన్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే పల్మనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టడంతో బ్లాకులు ఏర్పడ్డాయని, వాటిని కరిగించేందుకు ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చి యాంజియోగ్రామ్ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం పల్స్ సాధారణ స్థితిలో ఉందని, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ సాయంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడించారు.
వైద్యుల సూచనల మేరకు సుదర్శన్‌రెడ్డిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు స్టెంట్ లేదా బైపాస్ చికిత్స అవసరమయ్యే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ నాయకుల అభ్యర్థనతో రాష్ట్ర అధికారులు హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో అంబులెన్స్ సుమారు గంటన్నరలో యశోదా ఆసుపత్రికి చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రోహిణి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంబులెన్స్‌ను అనుసరిస్తూ హైదరాబాద్‌కు వచ్చారు. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

