
ప్రధాని మోదీ, సీఈసీ వెంటనే రాజీనామా చేయాలి: ఖర్గే
ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా జరపాలని డిమాండ్
‘సర్’ ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం డిమాండ్ చేశారు. ఢిల్లీ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సీఈసీపై ఒత్తిడి చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
సీఈసీని తొలగించాల్సిందే..
ఓటర్ల జాబితాలో చేసిన మార్పులతో పూర్తి సమాచారాన్ని బహిరంగపరచడం, రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాలను సంబంధిత సమాచారాన్ని సరళమైన ఫార్మాట్ లో సకాలంలో అందించడం వంటి ఐదు డిమాండ్లను ఖర్గే ప్రతిపాదించారు.
‘‘జ్ఞానేశ్ కుమార్ ను సీఈసీ పదవీ నుంచి తొలగించాలి. కుమార్ ప్రధాన మంత్రి ఒత్తిడితో పనిచేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలి’’ అని ఖర్గే అన్నారు. పేర్లు తొలగించిన వారికి పూర్తి సమాచారం అందించి, అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలి. ఎన్నికల డేటా ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలి. తద్వారా సమాచారాన్ని దాచిపెడుతున్నారనే ఆరోపణ మరోసారి రాకూడదంటే ఇలానే చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు.
పారదర్శకత కావాలి...
భారత్ ఓటర్లకు తమ ఓటుకు భద్రత ఉందనే విశ్వాసం ఉండేలా చూడాలని ఆయన ఇంకా పేర్కొన్నారు. మేము ఈ సమస్యను కేవలం ఎన్నికలలో గెలుపు, ఓటముల కోసం జరిగే పోరాటంగా చూడటం లేదు. ఎన్నికలు వస్తాయి, పోతాయి.. ప్రభుత్వాలు మారతాయి. కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం శాశ్వతమైనవి. ఇదే భారత ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా అధికారంలో ఉన్న నాయకుడు కాదు. సామాన్య ఓటరేనని మనం ప్రతి పౌరుడికి తెలియజేయాలి’’ అని ఆయన అన్నారు.
మోదీ టార్గెట్...
ప్రధానమంత్రి మోదీపై ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారని అన్నారు. ఇప్పుడు ఓట్లను హరించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. సీఈసీ వెంటనే తన పదవి నుంచి వైదొలగాలి. ఆయనకు ఆ పదవి నుంచి కొనసాగే అర్హత లేదు.
వచ్చే సంవత్సరంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ ఓటర్ కూడా తమ హక్కులను కోల్పోకుండా చూడటం చాలా కీలకమని కాంగ్రెస్ అధినేత అన్నారు. ‘‘ప్రతి వ్యక్తి ఓటు సురక్షితంగా ఉండేలా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా మనం హమీ ఇవ్వాలి. తద్వారా భారత్ ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి. అప్పుడే భారత్ భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జై రామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, పి. చిదంబరం సహ ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత సీఎం లు అయిన ఏ. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సుఖ్విందర్ సింగ్ సఖూ కూడా హాజరయ్యారు.
Next Story

