
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దుబాయ్ లింకులు..
కేదార్‌కు రూ.25 లక్షలు పంపిన రోహిత్ రెడ్డి బ్రదర్స్. ఆ మొత్తం ఎందుకు పంపారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు అసలు ఈ డ్రగ్స్ లింకులు ఎక్కడి వెళ్తాయన్న ఉత్కంఠ నెలకొనగా.. తాజాగా దుబాయ్ వరకు ఈ లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న కేదార్ అనే వ్యక్తికి మొయినాబాద్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు మరింత కీలకం అవుతోంది. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా గతేడాది దుబాయ్‌లో కేదార్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతనికి రోహిత్ రెడ్డి సోదరులకు మధ్య అత్యంత సన్నిహిత్య సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రోహిత్ రెడ్డి బ్రదర్స్‌కు కేదార్‌కు మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. వీరి బ్యాంకు ఖాతాల నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు పక్కా ఆధారాలతో నిర్ధారించారు. అసలు ఆ డబ్బు ఎందుకు బదిలీ చేశారు? అన్న అంశంపై పోలీసులు ప్రశ్నించగా సోదరులు ఇద్దరూ తలాతోక లేని సమాధానాలు చెప్తున్నారని, విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు, వివరాలు రాబట్టడం కోసం రోహిత్ రెడ్డి, అతని బ్రదర్ రితేష్ రెడ్డి కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరారు.

