కరీంనగర్ కాల్పుల కేసు.. నిందితుల ఫొటోలివే..
x

కరీంనగర్ కాల్పుల కేసు.. నిందితుల ఫొటోలివే..

సమాచారం అందించి పట్టుకోవడంలో సహాయపడిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించిన పోలీసులు.


కరీంనగర్‌లోని పీఎంజే జ్యూవెలరీలో కాల్పులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. పలువురు దుండగులు పట్టపగలే తుపాకులతో దాడులు చేసీ భారీ మొత్తంలో నగలను దోచుకున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ రాబరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను విడుదల చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. వారి ఫొటోలే కాకుండా వారి సమాచారం అందించి పట్టుకోవడంలో సహాయపడిన వారికి రూ.లక్ష బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా తమకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, వారి భద్రతకు ఎటువంటి భంగం కలగదని భరోసా ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో షాపును సిబ్బంది తెరిచారు. లాకర్‌లో ఉన్న నగలను డిస్‌ప్లేలో పెడుతుండగా, బైకులపై వచ్చిన దుండగులు కస్టమర్లలా నటిస్తూ లోపలికి ప్రవేశించారు. కొద్దిసేపటి తర్వాత వారు తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు.

సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు కాల్పులకు దిగారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది గాయపడ్డారు. కొందరు భయంతో బాత్‌రూమ్‌లో దాక్కున్నట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు షాపులో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. అనంతరం దుండగులు భారీగా బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోతూ ఒక దుండగుడు కిందపడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీపీ గౌస్ ఆలం స్వయంగా పరిశీలించారు. షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనాస్థలంలో బుల్లెట్లను కూడా గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఈ దోపిడీకి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More
Next Story