
తెలంగాణ జాగృతిలో చేరిన రాథోడ్ బాపురావుకు పుష్పగుచ్చం అందజేస్తున్న కవిత
జాగృతి చుట్టూ రాజకీయ జోరు:కార్యాలయంలో సందడి
కవిత వైపు కదులుతున్న నేతలు…
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు సంకేతాలు ఇస్తున్న కల్వకుంట్ల కవిత చుట్టూ వివిధ ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు గుమికూడుతుండగా, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాగృతిలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన నేపథ్యంలో కొందరు నేతలు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చి కవితతో భేటీ అవుతున్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. బాపురావుకు జాగృతి కండువా కప్పి కవిత పార్టీలోకి స్వాగతం పలికారు.
కవితతో ఆదివాసీ జేఏసీ నేతల భేటీ
ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు, ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు జాగృతి కార్యాలయంలో ఆదివారం కవితతో భేటీ అయ్యారు. ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకులు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆదివాసీ జాగృతి అధ్యక్షుడు లోకిని రాజు తదితరులు కవితతో సమావేశమై గిరిజన సమస్యలపై చర్చించారు.
బూర్జువా పార్టీలను వదిలేసి రండి : కవిత
ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలేసి కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు ఆదివారం తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
జనగణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
జనగణనలో ఆదావాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను చందా లింగయ్య దొర ఈ సందర్భంగా వివరించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదని, తో ఆదివాసీలు తామ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.ఆదివాసీలు తమ మతం చెప్పుకునేలా జనగణనలో ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి
2007లో కుటుంబంతో సహా తాను బోథ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించానని కల్వకుంట్ల కవిత గుర్తు చేసుకున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు, మన్నెం జ్వర పీడితులతో నిండి ఉండేదని.. ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు.ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పని చేయాల్సి ఉందన్నారు.బాపూరావు తెలంగాణ జాగృతి నుంచే బీఆర్ఎస్ లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారని.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని అన్నారు.తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందన్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు ఈరోజు జాగృతిలో చేరారని అన్నారు.
కవిత సీఎం కావాలి : బాపురావు
తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యారని, తనకు మూడోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్నారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని అన్నారు.
కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి చుట్టూ నాయకుల రాకపోకలు పెరుగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే సూచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివాసీ సమస్యలను కేంద్రంగా తీసుకుని ముందుకు సాగాలనే కవిత సంకల్పం, కొత్త పార్టీ భవిష్యత్ దిశను నిర్ధారించనున్న కీలక అంశంగా మారనుంది.
Next Story

