ఇక ఆ కంపెనీలన్నీ ఓఆర్ఆర్ బయటే.. HILTపై కీలక నిర్ణయాలు
x

ఇక ఆ కంపెనీలన్నీ ఓఆర్ఆర్ బయటే.. HILTపై కీలక నిర్ణయాలు

హైదరాబాద్ కాలుష్య నియంత్రణకు కీలక నిర్ణయాలు. HILT పాలసీపై చర్చలు, పరిశ్రమల మార్పు, MSP కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి.


హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓఆర్ఆర్ అవతలికి కాలుష్యకారక పరిశ్రమలను తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో HILT పాలసీ అమలుపై సచివాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య నిర్ణయాలు వెలువడ్డాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.

ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వం అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలసీ అమలు చేస్తుందని స్పష్టం చేసింది. పరిశ్రమలను తరలించే ప్రక్రియలో పారిశ్రామికవేత్తలు, కార్మికులకు పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

చైనా మోడల్ తరహాలో అభివృద్ధి చేయాలన్న సూచనలను కూడా పరిశీలనలోకి తీసుకుంది. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచే చర్యల్లో భాగంగా మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల భూములపై పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు. పరిశ్రమల కొత్త విధానంలో కార్మికులకు వసతి సదుపాయాలు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అలాగే కార్మికులకు అనుకూలంగా విధానాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MSP కొనుగోళ్లలో వేగం పెంచాలి: ఉత్తమ్

రబీ సీజన్ వరి కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరగాలని సూచించారు. మొత్తం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 5,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. త్వరలో మరో 3,500 కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 4.89 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరిగింది.

12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలాన్ని గుర్తించారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికించిన బియ్యం నిల్వకు జిల్లాల వారీగా కేటాయింపులు చేశారు. రవాణా, లేబర్, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వరి అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల వద్ద పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

Read More
Next Story