
కుమారుడి కేసులో బండి సంజయ్ ఏం చేయాలో చెప్పిన పొన్నం ప్రభాకర్
భగీరథ్ కేసుపై రాజకీయ ఆరోపణలు కాకుండా విచారణకు సహకరించాలని బండి సంజయ్‌కు పొన్నం ప్రభాకర్ సూచించారు.
బండి బగీరథ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ నడుచుకోవాల్సిన తీరుపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్.. సానుభూతి కోసం తాపత్రయపడకుండా.. పారదర్శకమైన విచారణ కోరాలని అన్నారు. రాజకీయ ఆరోపణలు చేయకుండా విచారణకు సహకరించాలని బండి సంజయ్‌కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ముందుగా నిష్పక్షపాత విచారణ కోరాల్సిందని అన్నారు.
తనపై కుట్ర జరుగుతోందని చెప్పడం, సానుభూతి పొందే ప్రయత్నం చేయడం కంటే దర్యాప్తుకు సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాలికను కలిశారా లేదా..? తన కుమారుడు ఆమెతో సంబంధాలు కొనసాగించాడా లేదా..? అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉందన్నారు. రాజకీయ ఆరోపణలు చేసేముందు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ చట్టానికి సహకరించేలా ఆదర్శంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎవరిపైనా వివక్ష చూపడం లేదని, రాష్ట్రంలోని ఆడబిడ్డలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం బాధితుల పక్షానే నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డీజీపీతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా డీసీపీ అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఎంతటి వారైనా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. విచారణపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
ఈ కేసులో బీసీ రాజకీయాలను తీసుకురావడం సరైంది కాదని అన్నారు. విచారణను అడ్డుకునేందుకు ఎవరైనా అధికారాన్ని ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం సహించదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారని, చట్ట ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

