
కాస్త గడువు ఇవ్వండి.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి
ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి. 32లో 29 డిమాండ్లు పరిష్కారం, కమిటీకి 4 వారాల గడువు.
టీజీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. బుధవారం అర్థరాత్రి నుంచి ఆర్‌టీసీ సమ్మె షురూ అయింది. బస్సులన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేరస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, సంస్థ పరిరక్షణతో పాటు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నామనే ఆరోపణలు సరైనవి కాదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించగలమని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. విలీనం, యూనియన్ ఎన్నికల విషయంలో సాంకేతిక అంశాలు పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీకి సూచించినట్లు చెప్పారు.
నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కూడా ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీ, డీఏలను ప్రభుత్వం క్లియర్ చేసినట్లు మంత్రి తెలిపారు. 2013 బాండ్లు కూడా పరిష్కరించామని చెప్పారు. పీఎఫ్ బకాయిలను రూ.1205 కోట్ల నుంచి రూ.600 కోట్లకు తగ్గించామని, సీసీఎస్ బకాయిలను రూ.690 కోట్ల నుంచి రూ.300 కోట్లకు తగ్గించినట్లు వెల్లడించారు. ప్రతి నెల పీఎఫ్, సీసీఎస్‌కు రూ.75 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగులపై పని భారం తగ్గించేందుకు 4538 పోస్టుల భర్తీ త్వరలో పూర్తవుతుందని చెప్పారు. 1134 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో సేవల నుంచి తొలగించబడిన వారిలో సుమారు 250 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జీవనాడి అని మంత్రి పేర్కొన్నారు. రోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణిస్తుండగా, అందులో 45 లక్షల మంది మహిళలేనని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని వివరించారు.
సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కార్లలో ప్రయాణించే సామర్థ్యం లేని ప్రజలకు ఇది భారమవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియజేయడానికి కార్మికులకు హక్కు ఉన్నప్పటికీ, సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గౌరవంగా చూసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమ్మెకు బదులుగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. తాను విద్యార్థి నాయకుడిగా కార్మికులకు అండగా ఉంటానని వెల్లడించారు.

