చంద్రబాబుకు బాధ్యత గుర్తుచేసిన తెలంగాణ మంత్రి
x

చంద్రబాబుకు బాధ్యత గుర్తుచేసిన తెలంగాణ మంత్రి

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని కోరిన పొన్నం ప్రభాకర్.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబుకు.. ఇప్పుడు కొందరి నాయకుల మాటల కారణంగా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుకు పొన్నం ప్రభాకర్ ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా వేరుపడ్డాయని, కానీ కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ రెండు రాష్ట్రాల ప్రజలను కూడా వేరు చేసేలా ఉంటున్నాయని పొన్నం ప్రభాకర్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ దగ్గర మొదలైన ఈ మాటల తూటాలు.. తాజాగా తేజస్వీ సూర్య వరకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, బీజేపీకి కావాల్సిన నేతగా ఉన్న చంద్రబాబుకు వీటిని సర్దుమణిగించాల్సిన బాధ్యత ఉందని అందుకనే ఈ లేఖ రాస్తున్నట్లు పొన్నం వివరించారు.

చంద్రబాబుకు 75వ జన్మదిన శుభాకాంక్షలతో ప్రారంభించిన ఈ లేఖలో, ఇటీవల వస్తున్న విభజన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్ర విభజన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ ఆమోదంతో జరిగిన ప్రక్రియ అని గుర్తు చేశారు. అలాంటి అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలుగువారి మధ్య అనవసర ఉద్రిక్తతలు పెంచుతాయని తెలిపారు. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ పోలికలు పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్యలని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఉందని, వాటిని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని చంద్రబాబును కోరారు. అలాగే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో కోణసీమ కొబ్బరి చెట్ల అంశంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ భావోద్వేగాలను దెబ్బతీసాయని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమం, ప్రజల ఆకాంక్షలు మీకు బాగా తెలుసని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తొలి, మలి దశ ఉద్యమాలు, అమరవీరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోయాయని గుర్తు చేశారు.

నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయాలను సరిదిద్దాలనే డిమాండ్లతో జరిగిన పోరాటాలకు మీరు ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు. ఆ పోరాటాలు గాంధేయ మార్గంలో సాగాయని, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. 2014లో సోనియా గాంధీ సారథ్యంలో, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరిగిందని వివరించారు. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు తమదైన మార్గంలో అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు, సంబంధాలు సహజంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, అలాంటి వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబునాయుడిని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజల ఐక్యతను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More
Next Story