
ప్రధాన్ తొలగింపే తొలి డిమాండ్.. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు నాలుగో రోజు కూడా పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాయి.
NEET-యూజీ 2026 పేపర్ లీక్ వివాదం పార్లమెంట్‌లో మరోసారి దుమారం రేపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నాలుగో రోజు కూడా పార్లమెంట్ ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
నాలుగో రోజూ నిరసనలు..
ప్రతిపక్ష ఎంపీలు పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని పట్టుబట్టారు. గురువారం పార్లమెంట్ ద్వారం వద్ద ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీలు ఒకేసారి నిరసనలు చేపట్టడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ మూడు ప్రధాన డిమాండ్లు..
కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమం ద్వారా మూడు ప్రధాన డిమాండ్లను వెల్లడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై బలప్రయోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలి. ఈ మూడు డిమాండ్లు నెరవేర్చాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఖర్గే విమర్శలు..
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా సభలో ప్రకటన చేయకుండా, అర్ధరాత్రి వీడియో విడుదల చేయడం సరైంది కాదన్నారు. పార్లమెంట్‌కు వచ్చే ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి, పెల్లెట్ గన్లను ఉపయోగించిన పోలీసులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాని ప్రకటనపై చర్చ..
పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, నేరస్థులకు కఠిన శిక్షలు విధించే నిబంధనలతో కూడిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం పరిశీలిస్తోందని తెలిపారు.
సోనియా విమర్శలు..
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ప్రభుత్వం పిరికితనంతో, విచక్షణారహితంగా వ్యవహరించిందని ఆరోపించారు. దేశ యువతను భవిష్యత్ నిర్మాణకర్తలుగా కాకుండా, శత్రువులుగా చూస్తోందని ఆమె విమర్శించారు.
రాజకీయంగా మరింత వేడెక్కిన వివాదం
ఒకవైపు కేంద్రం పేపర్ లీక్‌లపై కఠిన చట్టం తీసుకురానున్నట్లు ప్రకటిస్తుండగా, మరోవైపు ప్రధాన్ రాజీనామా వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్‌లోనూ, దేశ రాజకీయాల్లోనూ ప్రధాన చర్చనీయాంశంగా మారింది

