
వంద విదేశీ పర్యటనలు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ
అనేక దేశాలలో మొదటి సారి పర్యటించిన ప్రధాని
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిను పుష్కరకాలం అయింది. ఈ పన్నెండు ఏళ్లలో ఆయన వంద విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. తన వంద పర్యోటనగా ఫ్రాన్స్, స్లోవేకియా పూర్తి చేసి న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. తన విదేశాంగ విధానంలో ఆయన ప్రవాస భారతీయులతో సంబంధాలు, వ్యూహత్మక భాగస్వామ్యాలను కీలక స్తంభాలుగా ఉపయోగించుకుంటూ దేశంలో ప్రధానిగా అత్యధిక పర్యటనలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
విదేశీ పర్యటనలు ప్రారంభం..
పీఎంఓ లెక్కల ప్రకారం ఆయన 2014 జూన్ లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. తన తొలి పర్యటన భూటాన్ నుంచి ప్రారంభించారు. తరువాత బ్రిక్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ వెళ్లారు. అప్పటి నుంచి 78 దేశాలలో వంద విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. తన మొదటి పదవీ కాలంలో 49 పర్యటనలు, రెండో కాలంలో 27, చేయగా మూడో సారి ఇప్పటి వరకూ 24 విదేశీ పర్యటనలు చేశారు. ఫ్రాన్స్ లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాలతో పాటు స్లోవేకియాలో దౌత్యపర్యటన జరిపారు.
తొలి పర్యటనలు...
భారత ప్రధానులు ఇంతకుముందు వెళ్లని దేశాలకు కూడా నరేంద్ర మోదీ వెళ్లడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. 2024 లో పొలాండ్ లో పర్యటించారు. దాదాపు 45 సంవత్సరాల తరువాత అక్కడ అడుగు పెట్టిన ప్రధానిగా నిలిచారు. 41 ఏళ్ల తరువాత ఆస్ట్రియా, 43 ఏళ్లకు నార్వే, 57 ఏళ్ల తరువాత అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానిగా ఖ్యాతికెక్కారు. 1993 లో స్లోవేకియా స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత ప్రధాని పర్యటన సాగడం ఇదే ప్రథమం.
ఆయన తొలిసారిగా 2017 లో ఇజ్రాయెల్ వెళ్లారు. భారత ప్రధానులు ఇక్కడ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. 2015 లో మంగోలియాలో, 2026 లో ఉక్రెయిన్, 2026 లో స్లోవెకియాలో పర్యటించిన తొలి ప్రధాని అయ్యారు. రువాండాను సందర్శించిన తొలి ప్రధాని కూడా మోదీనే.
ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ..
మోదీ విదేశీ పర్యటన సందర్భంగా చాలామంది దేశాధినేతలు తమ ప్రోటోకాల్ ను పక్కనపెట్టి మరీ ఆయనకు స్వాగతం పలికారు. 2023 లో పపువా న్యూగినియా పర్యటన సందర్భంగా, అక్కడి సంప్రదాయాలకు భిన్నంగా సూర్యాస్తమయం తరువాత అధికారిక స్వాగతాలు పలికారు. ప్రధానమంత్రి జేమ్స్ మారాపే ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో మోదీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్మారకాన్ని స్వయంగా సందర్శించారు. నైస్ పర్యటన సందర్భంగా ఆ నగర మేయర్ సిటీ హాల్ వద్ద భారత త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలని ఆదేశించారు. ఇది విదేశీ ప్రముఖుడికి ఇచ్చే అరుదైన గౌరవం.
దౌత్యాలకు అతీతంగా..
మోదీ తరుచుగా కొన్ని దేశాలలో ఎక్కువగా పర్యటించారు. ఆయన తన పదవీకాలంలో ఫ్రాన్స్, యూఎస్ కు పదిసార్లు వెళ్లగా, జపాన్, యూఏఈకి ఎనిమిది సార్లు వెళ్లారు. ఆయన ప్రతి పర్యటనలలో ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరపడం అలవాటుగా మార్చుకున్నారు.
ఆయన పర్యటనలలో 2019 లో జరిగిన హౌదీ- మోదీ కార్యక్రమం, 2023 న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక వంటివి ప్రధాన హైలైట్ గా చెప్పవచ్చు.
ఇంకా పర్యటించన దేశాలు ఏమైనా..
ప్రధాని మోదీ ఇప్పటికే వంద పర్యటనలు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికే కొన్ని దేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిలో మెక్సికో, ఐర్లాండ్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీ లాంటి దేశాలు ఉన్నాయి. అలాగే చిలీ,పెరూ, కొలంబియా వంటివి కూడా జాబితాలో ఉన్నాయి. అత్యంత సున్నిత దౌత్య సంబంధాలు ఉన్న ఉత్తర కొరియా ఉంది.
మోదీపై నిషేధం..
మోదీ ప్రధాని కాకముందు ఆయనపై అమెరికా రాకుండా నిషేధం ఉంది. 2002 నాటి అల్లర్ల కేసులో ఆయనే బాధ్యుడిగా పేర్కొంటూ అమెరికా ఈ నిషేధం విధించింది. 2014 వరకూ దీనిని యూఎస్ అమలు చేసింది.
ఖర్చులు..
పార్లమెంట్ కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించిన గణాంకాల ప్రకారం 2015 నుంచి 2025 మధ్య ప్రధానమంత్రి విదేశీ పర్యటనల కోసం భారత్ సుమారు రూ. 762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అత్యధిక భాగం యూఎస్, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి.
అయితే ఆయన పర్యటనలను కాంగ్రెస్ పార్టీ తరుచుగా విమర్శిస్తూ ఉంటుంది. ఆయన దౌత్య విధానాలను ప్రశ్నిస్తూ ఉంది. వంద దేశాల పర్యటన పూర్తి చేసినప్పటికీ మన పొరుగు దేశాలు శత్రువులుగా మారాయని ఆరోపిస్తోంది. ఆయన చాలాసార్లు దేశీయ సమస్యలకంటే ప్రయాణాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారంది.
2026 ఆర్థిక అనిశ్చితి కారణంగా మోదీ విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని భారతీయులకు పిలుపునివ్వడం ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఈ పర్యటనలు భారత్ స్థాయిని బలోపేతం చేశాయని, వ్యూహాత్మకంగా భాగస్వామ్యాలను విస్తరించాయని, పెట్టుబడులను ఆకర్షించాయని, రక్షణ సహకారాన్ని పెంచాయని బహు పాక్షిక వేదికలలో దేశ వృద్ధి చేశాయని పేర్కొంటూ ప్రభుత్వం వాటిని నిరంతరం సమర్థించుకుంటూ వస్తోంది.
Next Story

