బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
x

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.


హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, మహబూబ్‌నగర్‌కు చెందిన కుటుంబం బడంగ్‌పేట మారుతీనగర్‌లో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన కీర్తి అనే యువతి గండిపేటలోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.

శనివారం ఉదయం కళాశాలకు వెళ్లిన కీర్తి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. సాయంత్రం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు స్థానికులు తెలిపారు. మంటలు వ్యాపించడంతో కేకలు, పొగను గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకునేసరికి కీర్తి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

అసలు కీర్తి ఆత్మహత్యకు కారణాలు ఏంటి? ఆరోజు కాలేజీలో ఏం జరిగింది? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Read More
Next Story