బీజేపీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
x
Retired employees Dharna under the leadership of BJP

బీజేపీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

ఆర్ధికసమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల సమయంలో ఎందుకు పెద్దపెద్ద వాగ్దానాలు చేశారని సూటిగా ప్రశ్నించారు


ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీరని అన్యాయం చేసిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నేతృత్వంలో పెద్దఎత్తున ఆందోళన జరిగింది. ఆర్ధికసమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల సమయంలో ఎందుకు పెద్దపెద్ద వాగ్దానాలు చేశారని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి అందాల్సిన ఆర్ధిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించకపోతే వారి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అధ్యక్షుడు నిలదీశారు.

ఈ సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొదలైనట్లు రామచంద్రరావు తెలిపారు. రిటైర్ అయిన మరుసటిరోజే ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను అందిస్తామన్న అప్పటి కేసీఆర్ హామీ ఏమైందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ఐదు డీఏలు పెండింగులో ఉండటం సోచనీయమన్నారు. ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారినికి నెలకు రు. 700 కోట్లు ఇస్తే ఆర్ధిక సమస్యలు ఎన్ని సంవత్సరాలకు తీరుతుందని మండిపడ్డారు. దాదాపు 40 మంది ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆర్ధిక ప్రయోజనాలు అందలేదన్న బాధతో మరణించినట్లు తెలిపారు. 40 మంది ఉద్యోగుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు ? అని ప్రశ్నించారు.

రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతుంది ? పీఆర్సీ ఎందుకు అమలు చేయలేకపోతోందో రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నుండి దిగిపోతుందని, బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రామచంద్రరావు హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ చేయనికారణంగా నిరుద్యోగుల సమస్యలూ పెరిగిపోతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీనే జీతాలు అందాల్సుండగా ఎవరికీ రావటంలేదని ఆరోపించారు. ఈ ధర్నాలో బీజేపీ కామారెడ్డి ఎంఎల్ఏ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎంఎల్సీలు కూడా పాల్గొన్నారు.


రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించలేదు అనటం వాస్తవమే. దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమనే చెప్పాలి. 2021లో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ నిధులు కేసీఆర్ ప్రభుత్వంలో లేవు. అందుకని ఏమిచేశారంటే ఏకంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మూడేళ్ళకు పెంచారు. దాంతో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుండి 61కి పెరిగింది. ఆ విధంగా అప్పటి నిధుల సమస్యను కేసీఆర్ ప్రభుత్వం వాయిదావేసింది. తర్వాత ఏమైంది అంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2021లో రిటైర్ అవ్వాల్సిన వేలాదిమంది ఉద్యోగులు 2024,25లో ఉద్యోగవిరమణ చేశారు. ఉద్యోగులు విరమణ చేయగానే పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ తదితరాలకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవు. అందుకనే రేవంత్ ప్రభుత్వం అన్నింటినీ పెండింగ్ పెట్టేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో మొదలైన సమస్య ఇపుడు రేవంత్ ప్రభుత్వానికి చుట్టుకున్నది. ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర వేలాది కోట్లరూపాయలు లేకపోవటంతో ప్రతినెలా రు. 700 కోట్లను ప్రభుత్వం విడుదలచేస్తోంది. దాదాపు 20 వేలమంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు 12 వేల కోట్లు చెల్లించాల్సుంటుంది. ఇంతమొత్తాన్ని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో చూడాలి.

Read More
Next Story