
పూరీ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ఇద్దరు మృతి, వంద మందికి గాయాలు
పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా తొక్కిసలాటలాంటి పరిస్థితి ఏర్పడి ఇద్దరు భక్తులు మృతి చెందగా, సుమారు 100 మంది గాయపడ్డారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రథయాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో జగన్నాథ ఆలయ సింహద్వారం సమీపంలోని బడా దండా (గ్రాండ్ రోడ్) వద్ద తొక్కిసలాటలాంటి పరిస్థితి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, సుమారు 100 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
భారీ రద్దీతో ప్రమాదం..
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలను లాగడం రథయాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఒక్కసారిగా జనసందోహం పెరగడంతో పలువురు ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి పలువురిని స్ట్రెచర్లపై ఆసుపత్రులకు తరలించాయి. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు భక్తులు చికిత్స పొందుతూ మృతి చెందారు.
వంద మందికి గాయాలు..
ఈ ఘటనలో సుమారు 100 మంది భక్తులు గాయపడినట్లు లేదా అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో దాదాపు 50 మందిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ఘటనాస్థలంలోనే ప్రథమ చికిత్స చేశారు. భద్రతా సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు చేపట్టాయి.
కొనసాగుతోన్న దర్యాప్తు ..
తొక్కిసలాటలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనకు గల అసలు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. జనసందోహ నియంత్రణలో ఎక్కడైనా లోపాలు జరిగాయా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
నవీన్ పట్నాయక్ స్పందన..
ఈ ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు బిజు జనతాదళ్ కార్యకర్తలు తమ పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు.

