తెలంగాణలో నేడు వర్షాల హెచ్చరిక: 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
x
తెలంగాణలో కురుస్తున్న వర్షాలు

తెలంగాణలో నేడు వర్షాల హెచ్చరిక: 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు


నైరుతి రుతుపవనాల రాకకు ముందే తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు ప్రారంభం కాగా, మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 3వతేదీన బుధవారం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఈ సందర్భంగా ఉరుములు,మెరుపులతో కూడిన గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు.





ఉరుములు, మెరుపులతో వర్షాలు

కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. అర్ధరాత్రి వేళ సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వర్షాలు విస్తరించాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మధ్య తెలంగాణ జిల్లాల్లో రాత్రి వేళల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.మధ్యరాత్రి వేళ హైదరాబాద్‌తో సహా నగర పశ్చిమ ప్రాంతంలో, పశ్చిమ, దక్షిణ, మధ్య తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ రెయిన్స్ తెలిపింది.

రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు గురువారం లోగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీవర్షం కురిసిందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీవర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాల చురుకుదనం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read More
Next Story