నేడు, రేపు పలు జిల్లాల్లో వానలు: మే 12 నుంచి వడగాలులు
x
తెలంగాణలో ఆదివారం వాతావరణ చిత్రపటం (ఫొటో : ఐఎండీ సౌజన్యంతో)

నేడు, రేపు పలు జిల్లాల్లో వానలు: మే 12 నుంచి వడగాలులు

తెలంగాణకు డబుల్ అలర్ట్,ఎల్‌నినో ప్రభావంతో ఈసారి రుతుపవనాలు తక్కువేనా?


తెలంగాణలో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అయితే మే 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు తీవ్రరూపం దాల్చి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారం రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,.ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు.వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి , ఆదిలాబాద్ జిల్లాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు ఆమె వివరించారు. హైదరాబాద్ నగరంలో తదుపరి 24 గంటల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు.

ద్రోణి ప్రభావంతో వర్షాలు

మరాట్వాడ ప్రాంతం నుంచి ఆగ్నేయ అరేబియన్ సముద్ర ప్రాంతం,దాని సమీపంలోని లక్ష దీవులు వరకు ద్రోణి కొనసాగింది. తూర్పు గాలులతో ద్రోణి ఆదివారం ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్నాటక తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలోని శ్రీలంక తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు.ఈ ద్రోణి ప్రభావం వల్ల ఆదివారం(నేడు), రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు.

పదిరోజుల పాటు వడగాలులు

ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి నాలుగు రోజుల్లో క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. మే 12వతేదీ నుంచి పది రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస కు, హైదరాబాద్ నగరంలో 43 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

2026 రుతుపవనాల ప్రభావం తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన చిత్రపటం

రుతుపవనాల వర్షాలు తక్కువ
బలమైన ఎల్-నినో ప్రభావం వల్ల ఈ ఏడాది 2018 వర్షాకాలం మాదిరిగానే ఉంటుందని, తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం 2025 నాటి వర్షాలను అస్సలు ఆశించవద్దని పేర్కొన్నారు. 2026 రుతుపవనాల కాలంలోని అన్ని నెలలు (జూన్ - సెప్టెంబర్) ఈ సంవత్సరం ఫర్వాలేదనిపించేలా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు 2014-15 లాగా తీవ్రంగా ఉండవని, కానీ గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే, ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నీటిని పొదుపుగా వాడాలని, తక్కువ వర్షాలకు అనుగుణంగా పంటల కాలాన్ని ప్రణాళిక చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాకాలంలో రుతుపవనాల వర్షాలు తక్కువగా కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.ఈ సంవత్సరం దక్షిణ తెలంగాణ జిల్లాలు లోటు వర్షపాతంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయన్నారు.
తెలంగాణకు ముందున్న రోజులు వాతావరణ పరంగా కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం రెండు రోజుల పాటు వర్షాలు ఉపశమనం కలిగించినా, ఆ వెంటనే వడగాలులు తీవ్రరూపం దాల్చే అవకాశముంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు కూడా ఆశించినంతగా లేకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story