తెలంగాణలో వారం రోజులపాటు వర్షాలు, ఎల్లో అలెర్ట్
x
తెలంగాణలో హీట్ వేవ్ పై ఐఎండీ విడుదల చేసిన జిల్లాల చిత్రపటం (ఫొటో :ఐఎండీ)

తెలంగాణలో వారం రోజులపాటు వర్షాలు, ఎల్లో అలెర్ట్

హీట్‌వేవ్ తర్వాత కూల్ బ్రేక్


ఉత్తర–దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే వారం రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్ ఘఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆదివారం నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు.
ఆదివారం తెలంగాణలోని కొమురం భీంఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ కేంద్రం తెలిపింది.

తెలంగాణ జిల్లాల్లో ఏడురోజులపాటు ఎల్లోఅలెర్ట్ జారీ

తెలంగాణలో ఆదివారం నుంచి ఏడురోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లోఅలెర్ట్ జారీచేసినట్లు ఐఎండీ కేంద్రం పేర్కొంది. సోమవారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ చెప్పారు.
రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి మూడు రోజుల్లో క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాస్త్రవేత్తలు అంచనా వేశారు.

మండుతున్న ఎండలు

తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు మండే ఎండలతోపాటు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.రెండు రోజుల పాటు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదివారం 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ వివరించింది.

హుస్నాబాద్ లో ఆదివారం కురుస్తున్న వడగళ్ల వర్షం (ఫొటో :తెలంగాణ వెదర్ మ్యాన్)

నేడు వర్షాలు

తెలంగాణలోని నల్గొండ,యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని వెదర్ మ్యాన్ తెలిపారు.సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఆదివారం వడగళ్ల వర్షం కురిసింది.సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత 4 రోజుల్లో పొడి వాతావరణం తర్వాత కొంత వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వివరించారు.

హాటెస్ట్ డే

ఈ వేసవి సీజన్‌లో ఇప్పటివరకు హాటెస్ట్ డే గా శనివారం నిలిచింది. నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.నల్గొండ జిల్లాలో 45.9 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ లో 45.9,సిద్దిపేటలో 45.9,ఆదిలాబాద్ జిల్లాలో 45.8,పెద్దపల్లిలో 45.8,కామారెడ్డిలో 45.7,కొమురం భీం ఆసిఫాబాద్ లో 45.7,జగిత్యాలలో 45.6,సూర్యాపేటలో 45.5,ఖమ్మంలో 45.2,మంచిర్యాలలో 45.1,కరీంనగర్ జిల్లాలో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్షోగ్రతలు నమోదయ్యాయి. 36 గంటల హీట్ వేవ్ తర్వాత తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ఈ సీజన్‌లో హాటెస్ట్ డే

హైదరాబాద్ నగరంలో ఈ సీజన్‌లోనే శనివారం హాటెస్ట్ డేగా నమోదైందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలోని విఠల్ వాడిలో 42.6డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్ లో 42.6,చాంద్రాయణగుట్టలో 42.5,యూసుఫ్‌గూడలో 42.5,ఉప్పల్ లో 42.4,ఎల్బీ నగర్ లో 42.4,సరూర్‌నగర్ లో 42.4,మలక్‌పేటలో 42.4,ఫలక్‌నుమాలో 42.4,బేగంబజార్ లో 42.4,శేరిలింగంపల్లిలో 42.4,బీహెచ్ ఈఎల్ లో 42.4,బేగంపేట్ లో 42.4,చార్మినార్ లో 42.3,కుత్బుల్లాపూర్లో 42.3,మూసాపేట్ లొ 42.3,కూకట్‌పల్లి లొ 42.2,మల్కాజిగిరి లో 42.2,సికింద్రాబాద్ లో 42.2,రాజేంద్రనగర్ లో 42.2, అల్వాల్ ప్రాంతంలో 42.1డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
తీవ్ర వడగాలులతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు ఈ వర్షాలు కొంత ఊరటనివ్వనున్నాయి. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read More
Next Story