
రేవంత్‌తో విభేదాలు లేవు.. రాజగోపాల్ రెడ్డి ప్లేట్ తిప్పేశారా?
సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడుకు రూ.2 వేల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలు, ఆయనపై చేసిన విమర్శల విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు తనకూ, రేవంత్ రెడ్డికి మధ్య ఎటువంటి విభేదాలు లేవంటూ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయిరాయించేశారు. అంతేకాదు తాను సీఎంను ఎప్పుడూ దూషించలేదని చెప్పారు. ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వివరించారు. దీంతో ఇంతకాలం సీఎం, రాజగోపాల్ రెడ్డి మధ్య ఉన్నట్లు కనిపించిన రాజకీయ దూరంపై కొత్త చర్చ మొదలైంది.
రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. సీఎం నిర్వహించే సభకు వేలాది మంది కార్యకర్తలతో హాజరవుతానని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రితో తన సంబంధాలపై ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టయింది. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్ణయాలు, నియోజకవర్గానికి నిధుల కేటాయింపు వంటి అంశాల్లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
తన నియోజకవర్గం మునుగోడుకు భారీగా నిధులు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడుకు సుమారు రూ.2 వేల కోట్ల నిధులు వచ్చాయని చెప్పారు. కొడంగల్, మధిర నియోజకవర్గాలకు ఏ స్థాయిలో నిధులు వచ్చాయో.. అదే స్థాయిలో తన నియోజకవర్గానికి కూడా నిధులు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో మునుగోడు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తోందనే విషయాన్ని ఆయన బలంగా చెప్పినట్లయింది.
రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఆయన బహిరంగంగానే తన అభిప్రాయాలను వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో విభేదించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.
అయితే ఇప్పుడు మాత్రం తాను సీఎంను ఎప్పుడూ దూషించలేదని, కేవలం ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే విభేదించానని రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చిందా? లేక గత వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇస్తున్నారా? అనే చర్చ మొదలైంది.
మంత్రి పదవిపై హైకమాండ్‌దే నిర్ణయం
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపైనా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ఊహాగానాలకు ఆయన తనదైన రీతిలో స్పందించినట్లయింది. అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పడం ద్వారా ఈ అంశంపై తాను ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయబోననే సంకేతం ఇచ్చారు.

