
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రామచందర్‌రావు నిరాహార దీక్ష
తెలంగాణలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు.
తెలంగాణ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాజకీయ పోరు ముదిరింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా తెలంగాణలో సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతోందని ఆయన ఆరోపించారు. ఈ బకాయిల కారణంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థుల చదువు, ఉద్యోగాలు, భవిష్యత్తుపై ఈ పరిస్థితి ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రామచందర్‌రావు విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఆయన సవాల్ విసిరారు. విద్యార్థుల భవిష్యత్తుపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు వచ్చి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పెండింగ్ బకాయిలను విడుదల చేయించాలని కోరారు. విద్యార్థులు ఇక ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారని రామచందర్‌రావు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.

