NMDC గనిలో అరుదైన వజ్రం.. 27.29 క్యారెట్ల డైమండ్!
x

NMDC గనిలో అరుదైన వజ్రం.. 27.29 క్యారెట్ల డైమండ్!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) హైదరాబాద్‌లో క్రైమ్ కలకలం! 14 రోజుల్లో 8 మర్డర్లు!

2) NMDC గనిలో అరుదైన వజ్రం.. 27.29 క్యారెట్ల డైమండ్!

3) ఐటీ జోన్‌లో భారీ పైథాన్‌!

1) NMDC గనిలో అరుదైన వజ్రం.. 27.29 క్యారెట్ల డైమండ్!

వజ్రాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆభరణాలే. కానీ ఆ మెరుపు వెనుక ఉన్న అసలు కథ మాత్రం గనుల్లో మొదలవుతుంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా మజ్‌గవాన్ ప్రాంతంలోని డైమండ్ మైన్స్‌లో 27.29 క్యారెట్ల జెమ్ క్వాలిటీ వజ్రం లభించింది. ఈ వజ్రం వేలంలో రూ.2 నుంచి 2.5 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని మార్కెట్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. పన్నా గనిలో 2010లో లభించిన 34.37 క్యారెట్ల వజ్రం, అప్పటి వేలంలో రూ.3.2 కోట్లకు విక్రయమైంది. తాజాగా లభించిన వజ్రం పరిమాణంలో దానికంటే తక్కువైనా.. పన్నా గనిలో NMDCకి లభించిన రెండో అతిపెద్ద వజ్రంగా నిలిచింది.

1965లో NMDC పన్నాలో వజ్రాల అన్వేషణ ప్రారంభించింది. 1966–68 మధ్య మజ్‌గావన్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకుని తవ్వకాలను విస్తరించింది. 1971–72లో వాణిజ్య స్థాయిలో యాంత్రీకృత వజ్రాల ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం నియంత్రిత ఓపెన్‌కాస్ట్ బెంచ్ మైనింగ్ ద్వారా వజ్రాలను వెలికితీస్తున్నారు. "పన్నా గనికి ఏటా 84 వేల క్యారెట్ల వజ్రాల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు 6 వేల క్యారెట్లు ఉత్పత్తి చేసినట్లు" ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు.

ఆరు దశాబ్దాల పన్నా వజ్రాల మైనింగ్‌పై GSI మాజీ డైరెక్టర్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణా’తో మాట్లాడారు. “కింబర్లైట్ వంటి శిలలను తవ్వి, క్రషింగ్, ప్రాసెసింగ్ ద్వారా వజ్రాలను వేరు చేస్తారు. ప్రభుత్వ ప్రధాన గనితో పాటు చిన్నస్థాయి తవ్వకాలకు లీజులు ఉన్నాయి. లభించిన వజ్రాలను అధికారులకు అప్పగించి, నాణ్యత, బరువు ఆధారంగా విలువ నిర్ణయించి వేలం వేస్తారు. పన్నాలో చిన్నవాటితో పాటు అప్పుడప్పుడు పెద్ద, నాణ్యమైన వజ్రాలు కూడా లభిస్తాయి” అని సత్యనారాయణ చెప్పారు.

“పన్నా గనిలో మంచి క్వాలిటీ వజ్రాలు అరుదుగానే దొరుకుతాయి. ఇక్క‌డ దొరికే వ‌జ్రాల‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో అంతగా డిమాండ్ ఉండదు. సాధారణంగా ఒకటి, రెండు క్యారెట్ల లోపు చిన్న వజ్రాలు, గ్రీన్ షేడ్‌లో ఉండేవే ఎక్కువగా లభిస్తాయి” అని గోల్కొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ ఛైర్మన్ ఇమ్రాన్ షరీఫ్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

“గనిలో లభించిన రఫ్ డైమండ్‌ను ముందుగా బరువు, నాణ్యత ఆధారంగా వేరు చేస్తారు. ఆ తర్వాత 4C ప్రమాణాలైన క్యారెట్‌ (బరువు), కట్‌ (కటింగ్ నాణ్యత), కలర్‌ (రంగు), క్లారిటీ (స్వచ్ఛత) ఆధారంగా విలువను అంచనా వేస్తారు. కటింగ్‌, పాలిషింగ్‌ తర్వాత వజ్రానికి మెరుపు, ఆకృతి రావడంతో దాని మార్కెట్ విలువ గణనీయంగా మారుతుంది. అనంతరం గుర్తింపు, నాణ్యతకు సంబంధించిన సర్టిఫికేషన్‌ పూర్తయిన తర్వాత వేలంలో విక్రయిస్తారు. అయితే రఫ్ డైమండ్ విలువ, పాలిష్డ్ డైమండ్ విలువ ఒకేలా ఉండదు.. కట్‌, కలర్‌, క్లారిటీ, క్యారెట్‌తో పాటు మార్కెట్ డిమాండ్‌ను బట్టి తుది ధర నిర్ణయమవుతుంది.” అని ఇమ్రాన్ చెప్పారు.

క్యారెట్ అంటే వజ్రం బరువు. కట్ ఎంత బాగా ఉంటే వజ్రానికి అంత మంచి మెరుపు వస్తుంది. కలర్‌లో రంగు ఎంత తక్కువగా ఉంటే అంత విలువ ఉంటుంది. క్లారిటీ అంటే వజ్రంలో మచ్చలు, లోపాలు ఎంత తక్కువగా ఉన్నాయన్నది వజ్రం నాణ్యత, విలువను నిర్ణయించడంలో ముఖ్యమైనది అని ఇమ్రాన్ చెప్పారు.

1965లో మొదలైన పన్నా వజ్రాల అన్వేషణ.. ఆరు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా లభించిన 27.29 క్యారెట్ల వజ్రం.. ఈ గనిలో దాగి ఉన్న విలువైన సంపదకు మరో ఉదాహరణ. గనిలో మొదలైన వజ్రం ప్రయాణం.. చివరకు వేలం వేదికపై ఎంత విలువ పలుకుతుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


2) హైదరాబాద్‌లో క్రైమ్ కలకలం! 2 వారాల్లో 8 హత్యలు!

ఒకవైపు హత్యలు. మరోవైపు దొంగతనాలు. హైదరాబాద్‌లో వరుస నేరాలతో ఏం జరుగుతోంది? వరుసగా వెలుగుచూస్తున్న నేర ఘటనలు నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రౌడీషీటర్ల మధ్య గొడవలు, హత్యలు, దాడులు, చోరీలు.. ఇలా వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత రెండు వారాల్లోనే 8 హత్యలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో.. నగరంలో శాంతిభద్రతలపై చర్చ మొదలైంది.

పగటిపూటే నడిరోడ్డుపై హత్యలునాగోల్‌లో రౌడీషీటర్లకు చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో.. కత్తులు, రాడ్లతో దాడి చేసి ఓ రౌడీషీటర్‌ను హతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఈ దృశ్యాలు సీసీటీవీలోనూ రికార్డయ్యాయి.

ఇక లాలాగూడలో గణేష్‌ విగ్రహం విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పాతకక్షల నేపథ్యంలో యువకుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేసి కత్తితో హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

చిలకలగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆల్వాల్‌ ప్రాంతాల్లోనూ వరుస హత్యలు వెలుగుచూశాయి.

వరుస చోరీలు..

మరోవైపు తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. మల్కాజిగిరిలో ఓ బిల్డర్‌ ఇంట్లో 48 తులాల బంగారం చోరీ కాగా, అంబర్‌పేట, హయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోనూ భారీగా నగదు, బంగారం, వజ్రాలు అపహరించిన ఘటనలు నమోదయ్యాయి.

ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా ప్రయాణించే యువకులను లక్ష్యంగా చేసుకుని దారిదోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

పబ్‌ల నుంచి రోడ్ల వరకు..

గ్యాంగ్‌ గొడవలుజూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో చిన్న వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మరోవైపు సనత్‌నగర్‌లో ఐడీ ప్రూఫ్‌ అడిగినందుకు హోటల్‌ సిబ్బందిపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కొత్త గ్యాంగ్‌లు.. యువతే ఎక్కువ

పోలీసుల దర్యాప్తులో రౌడీషీటర్ల మధ్య విభేదాలు, పాతకక్షలే కొన్ని హత్యలకు కారణాలుగా తేలుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రౌడీయిజాన్ని కొనసాగిస్తూ కొందరు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. కొత్తగా ఏర్పడుతున్న గ్యాంగుల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసున్న యువకులు ఎక్కువగా ఉండటం మరో ఆందోళనకర అంశంగా మారింది.

నేర నియంత్రణకు పోలీసులు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ.. వరుస ఘటనలు మాత్రం నగరవాసుల్లో భయాన్ని పెంచుతున్నాయి. దీంతో హత్యలు, దాడులు, చోరీలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.


3) ఐటీ జోన్‌లో భారీ పైథాన్‌!

హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌.. సాధారణంగా కనిపించేవి టెక్‌ కంపెనీలు, ట్రాఫిక్‌, బిజీగా ఉండే ఉద్యోగులు. కానీ అదే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపిస్తే..? అక్కడున్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? దుర్గం చెరువు పరిసరాల్లో తాజాగా ఓ భారీ కొండచిలువ కనిపించింది. ఓ ఐటీ కంపెనీ సమీపంలో ప్రత్యక్షమైన ఈ పైథాన్‌ను చూసి అక్కడున్న ఉద్యోగులు, స్థానికులు ఒక్కసారిగా భయపడ్డారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఐటీ ఉద్యోగి మాత్రం దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు.

వైరల్‌గా మారిన వీడియోలో.. కొండచిలువను చేతితో పట్టుకుని, అది తన చేతికి చుట్టుకున్నా ఏమాత్రం భయపడకుండా నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం తన మిత్రుడితో కలిసి దాన్ని బైక్‌పై తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్లు తెలుస్తోంది.

అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతాల్లో ఇలాంటి భారీ కొండచిలువలు ఎందుకు కనిపిస్తున్నాయి?దీనికి ప్రధాన కారణం నగరం వేగంగా విస్తరించడమే. హైదరాబాద్‌లో ఐటీ కారిడార్లు, అపార్ట్‌మెంట్లు, రోడ్లు, కమర్షియల్‌ భవనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దుర్గం చెరువు, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు చెరువులు, రాళ్ల ప్రాంతాలు, పొదలు, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండేవి. అలాంటి ప్రాంతాలు పాములు, ఇతర వన్యప్రాణులకు సహజ ఆవాసాలుగా ఉండేవి. నగర నిర్మాణం పెరిగేకొద్దీ వాటి ఆవాసాలు తగ్గినా.. కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెరువులు, నాలాలు, పొదలు, ఖాళీ స్థలాలు ఇప్పటికీ వాటికి ఆశ్రయంగా మారుతున్నాయి.

మరో ముఖ్యమైన కారణం. ఆహారం. కొండచిలువలు ప్రధానంగా ఎలుకలు, పక్షులు, కుందేళ్లు వంటి జంతువులను వేటాడతాయి. నగరాల్లో చెత్త, డ్రైనేజీలు, నిర్మాణ ప్రాంతాల కారణంగా ఎలుకలు వంటి చిన్న జంతువులు ఎక్కువగా కనిపించే ప్రాంతాలు ఉంటాయి. ఆహారం లభించే చోట్లకు పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాములు నగరంలోకి వచ్చాయనే కంటే.. నగరం వాటి సహజ ఆవాసాల వైపు విస్తరించిందని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

హైదరాబాద్‌ విస్తరిస్తున్న కొద్దీ.. మనుషులు, వన్యప్రాణుల మధ్య ఇలాంటి ఎదురుపడే ఘటనలు మరింత కనిపించే అవకాశం ఉంది. కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న హైదరాబాద్‌లో ప్రకృతికి చెందిన జీవులు కూడా ఇంకా మన మధ్యే ఉన్నాయి. వాటిని భయంతో చంపడం కాదు. జాగ్రత్తగా రక్షించడం, సురక్షితంగా తరలించడం అవసరం.

Read More
Next Story